అనయ బంగర్ (PC: Instagram)
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. తండ్రి బాటలోనే క్రికెటర్‌గా అడుగులు వేసిన అతడు.. తన శరీర ధర్మానికి అనుగుణంగా అనయగా మార్పు చెందాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అనయ బంగర్.. స్త్రీగా మార్పు చెందడంలో తన ప్రయాణం సాగిన తీరును ప్రస్తావిస్తూ తాజాగా వీడియో షేర్ చేసింది.
అంతులేని సంతోషాన్ని పొందాను
‘‘శారీరకంగా బలాన్ని కోల్పోయినా.. అంతులేని సంతోషాన్ని పొందాను. నా శరీరం మారిపోయింది. అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, వేసే ప్రతీ అడుగు నాకు మరింతగా నచ్చుతోంది’’ అని అనయ తన సంతోషాన్ని పంచుకుంది.
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ
కాగా మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా. 2001- 2004 మధ్య టీమిండియా తరఫున ఈ ఆల్‌రౌండర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 470, 180 పరుగులు సాధించాడు. అలాగే.. టెస్టుల్లో ఏడు, వన్డేల్లో ఏడు వికెట్లు తీశాడు.
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేసిన 52 ఏళ్ల సంజయ్ బంగర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కశ్మీరతో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన ఆర్యన్ బంగర్ ఇప్పుడు అనయ బంగర్‌గా మారాడు. కాగా అనయ కూడా క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో ఉంది.
గతంలో భారత దేశీ టోర్నీల్లోనూ ఆడిన అనయ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ట్రాన్స్ వుమన్‌కు క్రికెట్ ఆడే అవకాశం లేనందు వల్ల తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయ ఇటీవల ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ షేర్ చేసింది.
మా నాన్న బాటలో నడవాలనున్నాను.. కానీ
‘‘నా ప్రేమ.. నా కల.. నా ఆశయం.. నా భవిష్యత్తు.. అంతా క్రికెటే. మా నాన్న టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాదు.. కోచ్‌గానూ పనిచేశాడు. ఆయనను చూస్తూ పెరిగిన నేను ఆయన అడుగుజాడల్లో నడవాలని భావించాను. క్రికెట్లో నా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేశాను.
కానీ అర్ధంతరంగా ఆటను ఇలా వదిలేయాల్సి వస్తుందని అనుకోలేదు. అయితే, ఈ చేదు నిజాన్ని అంగీకరించకతప్పదు. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వుమన్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి.
కండబలం తగ్గింది
నా శరీరం మొత్తం పూర్తిగా మారిపోయింది. నా కండబలం తగ్గింది. శక్తిని కోల్పోయాను. అథ్లెట్లకు ఉండాల్సిన పవర్ మెల్లమెల్లగా తగ్గింది. ట్రాన్స్‌వుమన్‌కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి’’ అని అనయ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది.
కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. ట్రాన్స్‌జెండర్లకు ఇంటర్నేషనల్ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదు. 2023లో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ భవితవ్యం, వుమెన్ ప్లేయర్ల భద్రత, సమగ్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి?
Comments
Please login to add a commentAdd a comment