
లక్నో : దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువశక్తిని సద్వినియోగం చేసుకునేందుకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్) లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో భారత విజయోత్సవాలుగా పరిగణిస్తున్న ఐఐఎస్‌ఎఫ్ 2018 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో ఉదయం కేంద్రమంత్రి హర్షవర్ధన్ అధ్య క్షత వహించిన యంగ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్‌తో సైన్స్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. యువత తమ శక్తి, దూకుడు తత్వాన్ని సరైన దిశగా మళ్లిస్తే దేశాన్ని పట్టిపీడిస్తు న్న సమస్యలకు పరిష్కారాలు దొరకడం కష్టమే మీ కాదన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం తీసుకున్న చర్యల ఫలితంగా అనేకమంది భారతయువ శాస్త్ర వేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారన్నారు.
వైవిధ్యంతోనే రైతు ఆదాయం రెట్టింపు..
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులు పంటల సాగులో వైవిధ్యతను అవలంభించటం ఒక్క టే మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఐఐఎస్‌ఎఫ్‌లో భాగంగా శుక్రవారం వ్యవసాయ సమ్మేళనం జరిగింది. రైతులు, శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. పంటల సాగులో వైవిధ్యత కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను శాస్త్రవేత్తలు వివరించారు. వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనశాలలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలతోపాటు, పాఠశాల విద్యార్థులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆయా రంగాలపై ఆసక్తిని పెంచుకునేందుకు ఉద్దేశించిన సైన్స్ విలేజ్ కూడా శుక్రవారం ప్రారంభమైంది.