బంగారు గొలుసు వివాదంలో సీఎం సతీమణి
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక గురువానంద్ స్వామి ఇచ్చిన బంగారు గొలుసును స్వీకరించి ఆమె చిక్కుల్లో పడ్డారు. గురువానంద్ స్వామీ తన జుట్టులోంచి తీసి ఇచ్చిన బంగారు గొలుసును సీఎం భార్య తీసుకుంటున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేయడంతో వివాదం రాజుకుంది. మూఢనమ్మకాలను ప్రోత్సహించారంటూ, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై మహారాష్ట్ర లోని అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి అధ్యక్షుడు అవినాష్ పాటిల్ స్పందించారు. సీఎం భార్య వైఖరిని తప్పుబట్టిన ఆయన ఇది శాస్త్రీయ దృక్పథానికి వ్యతిరేకమని వాదించారు. ముఖ్యంగా చేతబడులు, తాంత్రిక విద్యలను నిషేధించిన రాష్ట్రంలో సాక్షాత్తు ప్రభుత్వాధినేత భార్యే ఇలా వ్యవహరించడం తగదన్నారు. అటు ప్రతిపక్ష ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ బ్లాక్ మ్యాజిక్ నివారణ యాక్ట్ కింద అమృతాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఆ ఆరోపణలను సీఎం సతీమణి అమృత ఖండించారు. తనకు అద్భుతాలు, మాయలు మీద నమ్మకం లేదన్నారు. స్వామీజీ తనను ఆశీర్వదిస్తూ గొలుసు ఇచ్చారే తప్ప వేరే ఏమీ లేదని తెలిపారు. కాగా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఇతర మూఢ నమ్మకాలను నిరోధించే క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ 2013 లో ఒక బిల్ ను ఆమోదించింది.