న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మూడు రోజుల క్రితం తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 1987లో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరు మూడేళ్లు మాత్రమే ఎంపీలుగా కొనసాగారు. కాకపోతే నాడు అమితాబ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించగా, నేడు మిథున్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
నాడు అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించగా, మిథున్ చక్రవర్తి మూడేళ్ల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నాడు బోఫోర్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో అమితాబ్ రాజీనామా చేయగా, నేడు శారదా చిట్‌ఫండ్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మిథున్ రాజీనామా చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్లనే రాజీనామా చేసినట్లు మిథున్ అధికారికంగా ప్రకటించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మొదటిసారి మిథున్ పేరు 2014లో బయటకు వచ్చింది. శారదా స్కామ్‌పై సిబీఐతోపాటు దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు ఆయన పలుసార్లు హాజరయ్యారు.
వేలాది మందికి రూ. కోట్లు ముంచారు...
వేలాది మందికి కోట్లాది రూపాయలను ఎగవేసిన శారదా చిట్‌ఫండ్ కంపెనీ 2013లో బోర్డు తిప్పేసింది. దానికి మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. చిట్‌ఫండ్ కంపెనీ నుంచి రెండు కోట్ల రూపాయలను తీసుకున్నట్లు తెలియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మిథున్‌ను విచారించారు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసినందుకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు మిథున్ వెల్లడించారు. అందులో 56 లక్షల రూపాయలను పన్ను కింద చెల్లించానని, మిగతా సొమ్ములో 1.19 కోట్ల రూపాయలను కూడా చెల్లిస్తానని అధికారులకు ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 2015లో ఈడీ అధికారులకు ఆయన చెల్లించారు కూడా. అయినప్పటికీ తుది చార్జిషీటులో కూడా మిథున్ పేరు కూడా ఉంది.
రాజ్యసభ నుంచి తప్పుకున్న రెండో వ్యక్తి
శారదా స్కామ్ కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజీనామా చేసిన రెండో వ్యక్తి మిథున్ చక్రవర్తి. ఈ కేసులో 2014, నవంబర్ నెలలో అరెస్టయిన శ్రీంజయ్ బోస్ ముందుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఇదే కేసులో నిందితుడైన కునాల్ ఘోష్‌ను 2013లోనే పార్టీ తొలగించింది. అయితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు.
దూకుడు పెంచిన సీబీఐ
శారదా చిట్‌ఫండ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ మధ్య తన దూకుడును పెంచింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్‌ను ఇటీవలనే అరెస్ట్ చేసింది. అయితే శారదా స్కామ్ కన్నా అతి పెద్దదిగా భావిస్తున్న ‘రోజ్‌వ్యాలీ’ స్కామ్‌లో ఆయనను అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఇదే స్కామ్‌కు సంబంధించి లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సుధీప్ బందోపాధ్యాయ్‌ని మొన్న మంగళవారం నాడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కారణంగానే తమ పార్టీ నేతలపై మోదీ సీబీఐని ప్రయోగిస్తోందని తృణమూల్ నేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.