
పండగలు ఉన్నాయి.. మా రాష్ట్రానికి రావద్దు!
న్యూఢిల్లీ: మిజోరం రాష్ట్ర ప్రభుత్వం చిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. 'ఎవరైనా వీఐపీలు డిసెంబర్ 14 నుంచి జనవరి 8 లోపు మా రాష్ట్రంలో పర్యటించే ఉద్దేశంతో ఉంటే దయచేసి ఆ పర్యటనలను వాయిదా వేసుకోవాలి' అని తెలిపింది. మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వీఐపీలు పర్యటిస్తే వారికి కావలసిన సదుపాయాలను కల్పించడం రాష్ట్రానికి ఇబ్బందిగా ఉంటుందని, అందువల్ల కేంద్రప్రభుత్వ అధికారులు, ఇతర వీఐపీలు ఈ సమయంలో పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరింది.
మిజోరం రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుంది. సాంప్రదాయ పద్దతిలో నిర్వహించే ఈ వేడుకల్లో స్థానిక తెగలు ఉత్సాహంగా పాల్గొంటాయి. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే క్రిస్మస్ సంబరాలకు ప్రభుత్వం ముందుగానే సమాయత్తమౌతుంది. ఈ వేడుకలు జనవరి మొదటి వారం వరకు కొనసాగుతాయి.