
కాంగ్రెస్ ఎమ్మెల్యే బిశ్వబంధుపై సస్పెన్షన్ వేటు
అగర్తలా: త్రిపుర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిశ్వబంధు సేన్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిరజిత్ సిన్హా మంగళవారం తెలిపారు. గతంలో బిశ్వబంధును అనేకసార్లు హెచ్చరించడం జరిగిందని, అయినా ఆయన తీరులో మార్పు రాకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు బిరజిత్ సిన్హా తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు నచ్చకుంటే ఎవరైనా నిరభ్యంతరంగా పార్టీని వీడవచ్చని సిన్హా స్పష్టం చేశారు. అంతేకానీ పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కాగా సస్పెన్షన్కు గురైన బిశ్వబంధు కూడా ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలలో ఒకరు. కాగా ఇటీవలి జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బిశ్వబంధు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా బిశ్వబంధుతో పాటు మరో ఆరుగురు కూడా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.