
తమిళనాడు మాజీ సీఎం ఎం కరుణానిధి (ఫైల్‌ఫోటో)
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి 95వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నేతలు కరుణానిధికి జన్మదిన శుభాకాంక్షలు అందచేశారు. కరుణానిధి నివాసం, పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన డీఎంకే శ్రేణులు అధినేత జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తన ఇంటివద్ద గుమికూడిన అభిమానులకు కరుణానిధి నవ్వుతూ అభివాదం చేశారు. కరుణానిధి కుమారుడు, అసెంబ్లీలో విపక్ష నేత ఎంకే స్టాలిన్, కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళి తదితర నేతలు పార్టీ చీఫ్‌కు ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
రచయిత, కవి, తత్వవేత్త, భారత రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత అయిన ఎం కరుణానిధి జన్మదినం సందర్భంగా ఆయన కలకాలం ఆరోగ్యంతో జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కరుణానికి జన్మదిన శుభాకాంక్షలు అందచేస్తూ ఆయన దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, డీఎండీకే వ్యవస్ధాపకులు విజయ్‌కాంత్, మంత్రి డీ. జయకుమార్ వంటి ప్రముఖులు కరుణానిధికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా తిరుకువలైలో 1924, జూన్ 3న జన్మించిన కరుణానిధి 1957 నుంచి రాష్ట్ర అసెంబ్లీకి 13 సార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని కరుణానిధి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువరూర్ నుంచి గెలుపొందారు. ఆరోగ్య కారణాలతో గత రెండేళ్లుగా కరుణానిధి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment