సాక్షి, చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కరుణానిధి ప్రస్థానం...
జూన్ 3, 1924న అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. వీరి పూర్వికులు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినట్లుగా చెబుతుంటారు. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు.
కరుణకు షణ్ముగ సుందరాంబాళ్, పెరియనాయమ్మాళ్ అనే చెల్లెళ్లుండేవారు. 8వ తరగతివరకు మాత్రమే చదువుకున్న కరుణకు ఆది నుంచి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. మూఢ విశ్వాసాల నుంచి, తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు వేసేవారు. నాటికల రచనతో పాటు తన స్నేహితులతో కలిసి స్వయంగా నాటికల ప్రదర్శన చేసేవారు కూడా. జస్టిస్ పార్టీ నాయకుడు అళగిరిస్వామి ప్రసంగాలకే ఉత్తేజితుడై 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన హిందీ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. హిందీకి వ్యతిరేకంగా నిరసన కార్య క్రమాలు చేపట్టి పలుమార్లు అరెస్టయ్యారు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.
పెరియార్ ద్రావిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన బాటలో నడిచారు. 1949లో పెరియార్‌తో విభేదించిన ఆయన అనుంగు శిష్యుడు సి.ఎన్.అన్నాదురై.. ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) స్థాపించారు. డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. ఆ పార్టీ కోశాధికారిగా కరుణానిధిని అన్నాదురై నియమించారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడిపోయిన అనంతరం తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలో 1957లో తొలిసారి డీఎంకే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కరుణానిధి కుళితలై నియోజక వర్గం నుంచి పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలు. అప్పటి నుంచి ఓటమెరుగని యోధుడిలా తన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు.
1967 డీఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను, ద్రవిడ మున్నేట్ర కజగం అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 45 ఏళ్లు. 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే సాధించిన విజయాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. ద్రవిడ మున్నేట్ర కగజం అధ్యక్షుడిగా దాదాపు 50 ఏళ్లపాటు కరుణానిధి కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత కరుణానిధితో విభేధాల కారణంగా డీఎంకే నుంచి ఎంజీఆర్ విడిపోవటం.. అన్నాడీఎంకే.. వైగో విడిపోయి ఎండీఎంకే.. ఇలా పలు పార్టీలు కరుణానిధి హయాంలోనే పుట్టుకొచ్చి అరవ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి. ఇక తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏ జెండా ఎగరవేయటంలో ఆయనదే కీలక పాత్ర.
సాహిత్యపిపాసి..
తమిళ సాహిత్యంలో కరుణానిధి తనదైన ముద్రను వేసుకున్నారు. తండ్రి వద్ద బాల్యదశలో కొంతకాలం కరుణానిధి నాదస్వరం కూడా నేర్చుకున్నారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధినే. పెరియార్ నిర్వహించిన కుడియరసు పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. ఎన్నో వ్యాసాలు రాశారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించారు. ద్రావిడ భావజాలం, హేతువాద సిద్ధాంతాల పట్ల కరుణానిధికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న వాక్పటిమ, రచనా పాటవం కారణంగా అనతికాలంలోనే డీఎంకేలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరుగా ఆయన ఎదిగారు.
Comments
Please login to add a commentAdd a comment