కరుణానిధి
ఎన్నికలు వస్తే చాలు ఎంతటి నాయకుల ప్రవర్తనలోనైనా, మాటతీరులోనైనా మార్పు వచ్చేస్తుంది. అంతకు ముందు ఎలా మాట్లాడినా, ఎలా వ్యవహరించినా అధికారం కావాలంటే మార్పురాక తప్పదు. ఓటర్ల మనసు దోచుకోవడానికి ఇలాంటివి ఎన్నెన్నో చేస్తూ ఉండాలి. వీటన్నిటికీ ఎవరూ అతీతులుకాదు. అందరిలో మార్పు వచ్చినట్లే డిఎంకె అధినేత కరుణానిధి స్వరం కూడా మారింది. ఎన్నికల వేళ డిఎంకె విధానంలో మార్పు వచ్చింది.
తమిళనాడుపై హిందీ రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ కరుణానిధి ఒకప్పుడు భారీ ఉద్యమమే చేశారు. పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ 1965లో కరుణానిధి తమిళనాడులో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 1967లో డిఎంకెఅధికారంలోకి రావడానికి ఆ ఉద్యమ ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ క్రమంగా క్షీణించిపోయింది. అయితే మారుతున్న పరిస్థితుల్లో డిఎంకె ఆలోచనల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అందర్ని కలుపుకుపోవాలంటే ఆలోచనలు, విధానాలు మార్చుకోకతప్పదనే నిర్ణయానికి కరుణానిధి వచ్చినట్లున్నారు. అప్పట్లో అంతటి పోరాటం చేసి తద్వారా ఫలితాలను పొందిన కరుణానిధి కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి(క్రైస్తవులు) భాయ్ భాయ్ అంటున్నారు.
దేశం మొత్తం మీద తమిళులకు భాషాభిమానం జాస్తి. కాని చెన్నై, కోయంబత్తూరు వంటి చోట్ల హిందీ మాట్లాడే వారి సంఖ్య బాగానే ఉంటుంది. ఈ నగరాల్లోని ఉత్తరాది ఓటర్లు రాజకీయాలను మార్చే స్థాయిలో ఉంటారు. కరుణానిధి మనవడు దయానిధి మారన్ పోటీ చేస్తున్న సెంట్రల్ చెన్నైలో హిందీ మాట్లాడే వారి సంఖ్య రెండు లక్షలకు పైబడి ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది వ్యాపారస్తులే ఉన్నారు. చెన్నైలోని సాప్ట్వేర్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులో దాదాపు 40 శాతం మంది ఉత్తరాది వారేనని అంచనా.
ఎన్నికల వేళ ఎవరైనాసరే అందరినీ కలుపుకుపోవలసిందే. భాష, మతం,కులం, ప్రాంతం అని మడికట్టుకు కూర్చుంటే కుదరదు. ఈ విషయాన్ని డిఎంకె బాగా ఆకళింపు చేసుకుంది. ఓట్ల కోసం అదరిని కలుపుకుపోవాలన్న లక్ష్యంతో డిఎంకె నాయకత్వం ముందుకు వెళుతోంది. హిందీ విషయంలో తన విధానాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. హిందీని తామెప్పుడు వ్యతిరేకించలేదని, బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించామని ఇప్పుడు డిఎంకె చెబుతోంది.