మోదీపై విమర్శల వర్షం | Modi criticized on the showers | Sakshi
Sakshi News home page

మోదీపై విమర్శల వర్షం

Published Wed, Feb 11 2015 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

మోదీపై విమర్శల వర్షం

మోదీపై విమర్శల వర్షం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ మిత్రపక్షాలతోపాటు, ప్రత్యర్థి పార్టీలు కూడా ప్రధాని మోదీపై నిప్పులు చెరిగాయి. ఇది ప్రధానికి ఓటమి అని, కమలనాథులు ఆత్మవిమర్శ చేసుకోవాలని శివసేన ధ్వజమెత్తగా, అహంకారం ఓడిపోయిందని, దేశానికి మార్పు అవసరమని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల ఫలితాలపై ఎవరేమన్నారంటే.. ‘‘బీజేపీ ఓటమి ప్రధాని మోదీ ఓటమి. దేశమంతా మోదీ గాలి వీస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ గాలికంటే ఢిల్లీలోని సునామీ శక్తిమంతమని అక్కడి ప్రజలు నిరూపించారు’’
- శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే
 
 ‘‘ఈ రోజు అహంకారం, రాజకీయ ప్రతీకారం ఓడిపోయాయి. బీజేపీ బెలూన్ పగిలిపోయింది’’
 ‘‘మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ చీఫ్)

 ‘‘లవ్ జీహాద్, ఘర్ వాపసీవంటి వాటివల్లే హస్తినలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది’’
 - అఖిలేశ్ యాదవ్(యూపీ సీఎం, ఎస్పీ నేత)

 ‘‘ఫలితాలు మోదీ పనితీరుకు కొలమానం. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ నివసించే ఢిల్లీలో బీజేపీ ఓటమి.. దేశ మనోగతానికి ప్రతిబింబం’’
 -  నితీశ్ కుమార్(జేడీయూ నేత)

 ‘‘ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఫలితాలు దానికి నిదర్శం’
 - రాందాస్ (పీఎంకే-బీజేపీ మిత్రపక్షం)

 ‘‘ఆప్‌ది చరిత్రాత్మక విజయం’
 - యోగా గురువు బాబా రామ్‌దేవ్

 ‘‘ఆప్ గెలుపుకాదు బీజేపీవ్యతిరేకవాదుల గెలుపు’
 - ఎంజీ వైద్య(ఆరెస్సెస్ నేత)

 ‘‘బీజేపీ, మోదీలు అజేయులు కారని తేలింది’
 -ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ నేత)

 ‘‘ప్రజలే గొప్పవాళ్లని తేలింది. అయితే కశ్మీర్‌లో బీజేపీతో కలసి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నానికి దీనికి సంబంధం లేదు’’
 - నయీమ్ అక్తర్ (పీడీపీ ప్రతినిధి)
 
ఢిల్లీ ఓటమిపై మంత్రులతో మోదీ సమీక్ష

ఢిల్లీ  ఎన్నికల్లో బీజేపీ ఓడడంతోమోదీ మంగళవారం  పార్టీకి చెందిన సీనియర్ మంత్రులతో సమావేశమై సమీక్షించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే.. జెట్లీ, రాజ్‌నాథ్, వెంకయ్య తదితరులతో గంటన్నర భేటీ అయ్యారు. వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.
 
అర్థం చేసుకోలేకపోయాం


 ఢిల్లీ ప్రజల మనసును మేం అర్థం చేసుకోలేకపోయాం. ఏదేమైనా వారి తీర్పును ఆమోదిస్తున్నాం. గతంతో మాదిరే ఇకపైనా వారికి సేవ చేస్తాం.
- బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్
 
కేంద్రం పనితీరుకు కొలమానం కాదు

ఫలితాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు కొలమానం కాదు. ప్రజలు స్థానిక అంశాల ఆధారంగా ఓటేశారు. వరుసగా 8 ఎన్నికలు ఎదుర్కొన్నాం. ఏడిటింటిలో గెలిచి, ఇప్పుడు తొలిసారి ఓడాం. బీజేపీ తన  తప్పులు సరిదిద్దుకుంటుంది.
 - కేంద్ర మంత్రి  వెంకయ్యనాయుడు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement