గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ త్రీడీ ఎన్నికల ప్రచారానికి ....
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ త్రీడీ ఎన్నికల ప్రచారానికి రూ. 61 కోట్లకు పైగా ఖర్చయిందని బీజేపీ తెలిపింది. దృశ్య, శ్రవణ మీడియా ప్రచారం కోసం మరో రూ. 304 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇటీవల ఎన్నికల సంఘానికి అందించిన వ్యయాల నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం రూ. 714 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపింది.
మోదీ ఎన్నికల్లో ఒక ప్రాంతం నుంచి చేసిన ప్రసంగాలను త్రీడీ తెరల ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం తెలిసిందే. బీజేపీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మోడీ వినూత్నంగా చేపట్టిన త్రీడీ సభల కోసం రూ. 51.36 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ. 10 కోట్లను లెసైన్స్ ఫీజు కింద చెల్లించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనలు, ఎస్సెమ్మెస్‌లు తదితరాల కోసం రూ. 304 కోట్లు వెచ్చించారు. మోదీ, రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు, అమిత్ షా తదితర పార్టీ మఖ్య ప్రచారకర్తల ప్రయాణాల కోసం రూ. 77.83 కోట్లు ఖర్చు చేశారు.