ఢాకా సమీపంలోని బంగ్లాదేశ్ జాతీయ అమరవీరుల స్థూపం వద్ద భారత ప్రధాని (ఇన్సెట్: హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి స్వాగతం
ఢాకా : బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో అసువులు బాసిన అమరులను తలుచుకున్నపుడు.. తన పూర్వీకుల చితాభస్మం నుంచి కొత్త జీవితాన్ని పొందే కాల్పనిక పక్షి ఫీనిక్స్ గుర్తుకొస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢాకా సమీపంలోని జాతీయ అమర వీరుల స్థూపాన్ని సందర్శనతో ఆయన తన రెండురోజుల బంగ్లాదేశ్ పర్యటను ప్రారంభించారు.
1971 బాంగ్లా విముక్తి పోరాటంలో అమరులైనవారికి పూల మాలలతో ఘన నివాళులు అర్పించిన మోదీ.. స్థూపం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఏడు మెట్లు వాటిపైన ఏడు త్రికోణాల ఆకృతిలో ఉండే బంగ్లా జాతీయ అమరవీరుల స్థూపం విశేషాలను ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఆ తరువాత బాంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబ్ ఉర్ రహమాన్ స్మారక మ్యూజియాన్ని మోదీ సందర్శించారు. ముజీబ్ కు సంబంధించిన వస్తువులను తీక్షణంగా పరిశీలించారు.
అంతకుముందు తొలిసారిగా బాంగ్లా పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ ను పక్కనపెట్టి బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో బంగ్లాతో సరిహద్దు ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బంగ్లా ప్రధాని హసీనాతో మోదీ చర్చిస్తారు. ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పలువురు ఉన్నతాధికారులు కూడా బంగ్లా పర్యనలో పాల్గొంటున్నారు.