
మోహన్ లాల్ మాటంటే మాటే.. రూ.1.63 కోట్ల చెక్ వెనక్కు
తిరువనంతపురం: మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మాటంటే మాటే. జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో తన ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం నిర్వహించినందుకుగాను కేరళ ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ.1.63 కోట్ల మొత్తాన్ని మోహన్లాల్ తిరిగి ఇచ్చేశారు. మోహన్ లాల్ ఈ మొత్తానికి చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంపై విమర్శలు రావడంతో పారితోషకం వెనక్కు ఇస్తానని మోహన్ లాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా మోహన్ లాల్ ఇచ్చేస్తానన్న డబ్బు తీసుకోబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంద్ ఇంతకుముందు చెప్పారు. నైతికంగా ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. మోహన్ లాల్ చెక్ అందజేసినా దీన్ని అంగీకరించాలా వద్దా అన్న విషయం గురించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆదేశాలూ రాలేదని క్రీడల నిర్వాహకులు చెప్పారు.