
లెఫ్టినెంట్ కల్నల్ అమర్ రహే..
బెంగళూరు: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ మృతదేహాన్ని సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ నిరంజన్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం మారుమోగిపోతోంది.
జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ జీ)లో విధులు నిర్వహిస్తున్న కల్నల్ నిరంజన్.. విధినిర్వహణలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచి ఉగ్రమూకలతో పోరాడుతూ ఆదివారం అనూహ్యరీతిలో మరణించిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికుల్లో నిరంజన్ ఒకరు. కేరళకు చెందిన ఆయన.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులో విద్యాభ్యాసం చేసి ఆర్మీలో చేరారు.
ఉగ్రవాదులు అమర్చిన గ్రేనేడ్ ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు సైనికులు చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆరుగురు ఉగ్రవాదుల బలగాలు మట్టుపెట్టగలిగాయి. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.