విష్ణు గుర్జార్.. అతను జైపూర్‌లోని స్వారీ మాన్ సింగ్(ఎస్ఎమ్ఎస్) ఆసుపత్రిలో మార్చురీ గదిలో పనిచేస్తాడు. శవాల మధ్యలో పని చేసినప్పటికీ ఎప్పుడూ శ్మశానం వైపు వెళ్లేవాడు కాదు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇప్పుడు అతను తరచూ శ్మశానానికి వెళ్తున్నాడు. అనాథలా మిగిలిపోతున్న శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేస్తున్నాడు. హిందువులైనా ముస్లింలైనా తనకు అందరూ సమానమేనంటూ అంతిమ సంస్కారాలు చేస్తున్నాడీ యువకుడు. కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాల బాధ్యత మార్చురీ వర్కర్ల మీద పెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఆరు గంటల షిఫ్ట్ కేటాయిస్తూ కరోనా శవాల అంతిమ సంస్కారాలకు సాయం చేయాల్సి ఉంటుందని ఆదేశించింది.
వైరస్ సోకుతుందన్న భయం వెంటాడుతుంది
ఈ నిర్ణయం గురించి గురించి విష్ణు గుర్జార్ మాట్లాడుతూ.. "నా జీవితంలో శ్మశానానికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. పైగా ఆ ప్రదేశమంటే నాకు భయం కూడా. అంతేకాకుండా ఇస్లామిక్ ఆచారాల గురించి ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు హిందువులైనా, ముస్లింలైనా నాకు అందరూ సమానమే. ఎందుకంటే నాకు ఎలాంటి మతం లేదు. ఎవరూ లేని వారికీ నేనున్నా" అని చెప్పుకొస్తున్నాడు. ఇతనితోపాటు తోటి వర్కర్లు పంకజ్, మనీశ్, మంగళ్, అర్జున్, సూరజ్‌లు కూడా ఇలాంటి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. (ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు)
మమ్మల్ని ఎవరూ గుర్తించరు..
ఆరు నెలల పాప, మూడేళ్ల కొడుకు ఉన్న విష్ణు గత 40 రోజులుగా ఇంటికే వెళ్లలేదు. మరోవైపు పంకజ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. వీరి శ్రమను, సేవలను ప్రజలు, ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. గుర్జార్ మాట్లాడుతూ.. "ఇళ్లకు వెళ్లినప్పుడు కాలనీ వాసులు ప్రశంసించడం మాని తిరిగి భయపెడతారు. మమ్మల్ని, మా సేవలను గుర్తించరు. కనీసం మాకు మంచి భోజనం వంటి సరైన సదుపాయాలు కూడా లభించవు" అని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇప్పటివరకు కరోనా వల్ల 63 మంది మరణించగా ఇందులో 36 శవాలను శ్మశానానికి తీసుకెళ్లి మరీ మార్చురీ వర్కర్లు అంత్యక్రియలు నిర్వహించారు. (హెల్మెట్ ధరిస్తే.. శానిటైజర్ ఫ్రీ)
Comments
Please login to add a commentAdd a comment