పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. రాజస్థాన్‌లో ఓ పెళ్లి మాత్రం కోవిడ్ సెంటర్‌లో జరగాలని దేవతలు నిర్ణయించినట్టున్నారు. ఇటీవల రాజస్థాన్ బారాలో ఒక జంట కెల్వారా కోవిడ్ సెంటర్‌లో పెళ్లితో ఒక్కటయ్యింది. నవ వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పెళ్లి జరిపించే çపురోహితుడు పిపిఇ కిట్లు ధరించి మరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇలాంటి పెళ్లి జరగడం దేశంలో ఇదే మొదటిదిగా చెప్పుకోవచ్చు.
కరోనా మహమ్మారి కారణంగా వివాహవేడుకలపై అనేకానేక ఆంక్షలు తప్పడం లేదు. పెళ్లిళ్లలో మాస్కులు ధరించకపోయినా, ఎక్కువ సంఖ్యలో హాజరైనా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా పోలీసులు జరిమానాలు విధించిన సంఘటనలు చూశాం. కొన్ని పెళ్ళిళ్లలో వెయిటర్లు పిపిఇ కిట్లు ధరించడమూ చూశాం. కానీ, పెళ్లిలో వధూవరులు పిపిఇ కిట్లు ధరించడం మాత్రమే ఇప్పుడే చూస్తున్నాం. ఇందులో పెళ్లికూతురెవరో, పెళ్లికొడుకెవరో ఎత్తును బట్టి కొంత తెలుసుకోవచ్చు కానీ, మిగిలిన అతిథులలో ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. పురోహితుడంటే ప్రత్యేకంగా తెల్లసూటేసుకున్నాళ్లెండి.
విషయమేమంటే..
రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఛతర్‌గంజ్ గ్రామానికి చెందిన వధువుకు దంతా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమె కోవిడ్–19 పరీక్ష చేయించుకుంది. పాజిటివ్ అని వచ్చింది. ఆ తరువాత వధువు కూడా పరీక్ష చేయించుకుంది. పెళ్లి జరిగే రోజున వధువుకు కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దీంతో వాయిదా వేయలేక అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలనుకున్నారు పెద్దలు. అందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, ఈ పెళ్లిలో వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మొత్తం 7 గురు పిపిఇ కిట్లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పెళ్లి తంతు ముగించారు. పిపిఇ కిట్లతో వివాహం జరుపుకున్న జంటగా ఈ రాజస్థానీ వధూవరులు వార్తల్లో నిలిచారు. ఈ వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది.
కోవిడ్–19 కిట్ల పెళ్లి
Published Sun, Jan 24 2021 1:08 AM | Last Updated on Sun, Jan 24 2021 3:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment