తల్లులు చురుగ్గా ఉంటేనే..
సాక్షి: తన కూతురు అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. ఈ విషయంలో పిల్లలకు వారు అనేక సూచనలిస్తుంటారు. అయితే ఇలాంటి మాటల కన్నా పిల్లలపై తల్లుల ప్రవర్తనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. తల్లులు వారి పనుల విషయంలో ఎంత చురుగ్గా ఉంటే పిల్లలు కూడా అంత చురుకుగా ఉంటారని తాజా అధ్యయనం తెలిపింది.
అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండే తల్లులను, పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారని పరిశోధకులు అంటున్నారు. తల్లులు ఎక్కువ సేపు కూర్చుని ఉండే స్వభావాన్ని కలిగి ఉంటే అలాంటివారి పిల్లలు ఎక్కువ సేపు టీవీ చూసే స్వభావం కలిగి ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాస్టిల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 5 నుంచి 12 ఏళ్ల వయసు కలిగిన కొంత మంది పిల్లలను వారు అధ్యయనం చేశారు.
‘‘కూతుళ్లకు తల్లులే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని చూసే కూతుళ్లు ప్రవర్తనను అలవర్చుకుంటున్నారు. వారు చురుకుగా, బాధ్యతగా వ్యవహరించే విషయంలో తల్లుల ప్రభావమే ఎక్కువ.’’ అని ప్రధాన పరిశోధకుడు బార్న్స్ అన్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం పురుషులు, బాలురుతో పోలిస్తే స్త్రీలు, బాలికలు కొంత తక్కువ చురుకుదనంతో ఉంటున్నారు. తల్లులు చురుకుగా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. తల్లుల ప్రభావం ఈ విషయంలో కొడుకులపై మాత్రం పెద్దగా లేదు. కూతుళ్లు చురుకుగా ఉండాలని కోరుకునే తల్లులకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.