కనువిందు చేయనున్న మొఘల్ గార్డెన్
రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఉన్న మొఘల్ గార్డెన్ ద్వారాలు శుక్రవారం నుంచి సామాన్యుల కోసం తెరుచుకోనున్నాయి.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఉన్న మొఘల్ గార్డెన్ ద్వారాలు శుక్రవారం నుంచి సామాన్యుల కోసం తెరుచుకోనున్నాయి. ప్రపంచంలోని అతి సందర ఉద్యానవనాల్లో ఒకటైన మొఘల్ గార్డెన్‌ను చూసేందుకు మార్చి 19 వరకు సామాన్యులకు అవకాశం ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సోమవారం మినహా గేట్ 35 ద్వారా ప్రవేశించి మొఘల్ గార్డెన్‌ను వీక్షించవచ్చు. మార్చి 20 న వికలాంగులకు, రైతులకు, సైనికులకు ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం మధ్యాహ్నం ఈ ఉద్యానవన సందర్శనను లాంఛనంగా ప్రారంభించారు.
రకరకాల పూదోటలతో అలరారే మొఘల్ గార్డెన్‌లో ప్రస్తుతం 12 వేల ట్యూలిప్‌లు వికసించి నయనాందం కలిగిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రియమైన ఈ మొక్కలను నెదర్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెల్పించి ఒకేచోట నాటారు. ప్రిమియులస్, లేడీస్ సర్స్, ఐస్ ప్లాంట్ వంటి వాటిని తొలిసారి వీక్షించే అవకాశం కల్పించారు. హిమాలయాలలో కనిపించే లేడీ పర్స్ పూవు మహిళల పర్స్ ఆకారంలో ఉంటుంది. మొఘల్ గార్డెన్‌లో 70 రకాల సీజనల్ పూల మొక్కలున్నాయి.
మొగల్ గార్డెన్ విశేషాలు..
15 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన మొఘల్ గార్డెన్‌లో రకరకాల 15 ఉద్యానవనాలు ఉన్నాయి. స్పిరిచ్యుయల్ గార్డెన్‌లో వివిధ మతాలలో ప్రాధాన్యం కలిగిన 40 రకాల మొక్కలున్నాయి. ఇదికాక హెర్బల్ గార్డెన్, బయో డైవర్సిటీ గార్డెన్, నక్షత్రశాల గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, కాక్టస్ గార్డెన్, న్యూట్రీషన్ గార్డెన్ వంటివి ఉన్నాయి. మ్యూజికల్ గార్డెన్ 12 ఫౌంటెయిన్లతో అందాలు విరజిమ్ముతుంది. కాక్టస్ గార్డెన్‌లో 80 రకాల కాక్టస్ మొక్కలు, బోన్సాయ్ గార్డెన్‌లో 250 మొక్కలు ఉన్నాయి. రోజ్ గార్డెన్‌లో పలుపు, ఆకుపచ్చ వంటి వివిధ రంగుల135 రకాల గులాబీ మొక్కలున్నాయి.
మదర్‌థెరీసా, రాజా రామ్ మోహన్ రాయ్, కిస్ ఆఫ్ ఫైర్, అర్జున్, భీమ్ వంటి పేర్లతో ఈ గులాబీ మొక్కలు సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. గార్డెన్‌లో పూల మొక్కలు, పచ్చిక బయళ్లే కాక 5000 ఫల వృక్షాలున్నాయి. వీటిలో కదంబం, వేప, నేరేడు, అంజీరా వంటి 160 రకాల వృక్షాలున్నాయి. న్యూఢిల్లీ నగర వాస్తుశిల్పి సర్ ఎడ్విన్ లుట్యెన్స్ కాశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్స్ ప్రేరణతో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఈ ఉద్యానవనాన్ని రూపొందించారు.