ముంబాయి : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల రోజు అందరి దృష్టి మొదటి ర్యాంకు ఎవరికి వచ్చింది.. స్టేట్ టాపర్ ఏ స్కూల్ విద్యార్థి.. ఎంతమంది పాస్ అయ్యారు లాంటి విషయాలపై ఉంటుంది. మీడియా కూడా టాపర్ల గురించే చెబుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇవన్నీ కాదని బార్డర్ మార్కులతో పాసైన ఓ విద్యార్థి గురించి మీడియా తెగ ప్రచారం చేసింది. టాపర్ల కంటే ఎక్కువగా ఈ విద్యార్థి గురించి చర్చ జరిగింది. కేవలం బార్డర్ మార్కులతో పాసైన వ్యక్తి గురించి ఇంత ప్రచారం ఎందుకు అనుకుంటున్నారా.. మరి అక్కడే ఉంది ట్విస్టు. అతడికి అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా 35 మార్కులు వచ్చాయి. అంటే.. అన్ని సబ్జెక్టుల్లో అతడు బార్డర్ మార్కులతో పాసయ్యాడన్నమాట. దీంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు.
ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ స్థానికంగా ఉన్న అందరిలాగే టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. గత శనివారం మహారాష్ట్ర టెన్త్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. కానీ రిజల్ట్ చూసే సరికి షాకైపోయాడు. ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు వచ్చాయి. ఇలా బార్డర్ మార్కులతో బయటపడటంతో ఊరంతా అతని గురించే చర్చ జరిగింది. లోకల్ మీడియాకు ఈ విషయం తెలియడంతో రోజు మొత్తం అక్షిత్ గురించే ప్రచారం చేసింది. ఈ సందర్భంగా అక్షిత్ తండ్రి గణేశ్ మాట్లాడూతూ..."మా కుమారుడి ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాం. అతడు 55శాతం మార్కులతో పాస్ అవుతాడని అనుకున్నాం. కానీ విచిత్రంగా అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే వచ్చాయి. అయితే అతడు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. అక్షిత్ తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇక స్కూల్‌కు వెళ్లలేదు. టెన్త్ పరీక్షలు ప్రైవేటుగా రాసి పాసయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమనే అక్షిత్...క్రీడలనే కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఈ మార్కులపై జోకులు ఓ రేంజ్‌లో పేలాయి. ఇదో "నేషనల్ రికార్డు" అంటూ కొందరు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment