ముస్లిం ఉన్నతాధికారికి ఒవైసీ సెగ
బెంగళూరు: ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ భరతమాత వ్యాఖ్యల వివాదం కర్ణాటకలో ఓ ముస్లిం ఉన్నత ఉద్యోగిని చుట్టుకుంది. పుత్తూరు లోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ ఎబి ఇబ్రహీం ఈ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హిందూ దేవాలయ ఉత్సవాల్లో ఆ ముస్లిం అధికారి పేరు ఉండానికి వీల్లేదంటూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే ఆలయ ఉత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో ముస్లిం అధికారి ఏబీ ఇబ్రహీం పేరు ఉండడంపై వీహెచ్పీ, భజరంగ దళ్ అభ్యంతరం తెలిపింది. ఉత్సవాల్లో ఆయన పేరును తొలగించాలని స్థానిక విశ్వ హిందూపరిషత్ , భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేసింది. కొత్త కార్డులు ముద్రించాలని పట్టుబట్టింది. అయితే ఇబ్రహీంకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యా శాఖ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ.. మతమూఢుల కోసం ప్రభుత్వ నియమాలు మారవని స్పష్టం చేశారు.
అటు ఈ అంశంపై ఇబ్రహీం స్పందిస్తూ తన పరిధిలో ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా దేవాలయ అభివృద్ధి కోసం చాలా చేశానన్నారు. కాగా రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాలనా అధికారి ఇలాంటి ఇబ్బందులు కావడం మొదటిసారని కొంతమంది అధికారులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వందల మంది ముస్లిమేతర ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఇలాంటి మతపరమైన వివక్ష ఎదురు కాలేదన్నారు.