నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య
న్యూఢిల్లీ: తన భర్త ఎంతో మానసిక వేదనకు గురయ్యాడని బీఎస్‌ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ భార్య అన్నారు. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని బయటపెట్టిన జవానే తేజ్ బహదూర్ యాదవ్. నాసిరకం ఆహారం విషయాన్ని బయటపెట్టిన కారణంగా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో పాటు బెదిరించారని ఫోన్ లో 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ భార్యకు తెలిపారు.
తన భర్త కోసం గత రెండు రోజులుగా ఎదురుచూస్తున్నానని, అయితే ఆయన ఇప్పటికీ ఇంటికి రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏదో విధంగా వేరొకరి నుంచి మొబైల్ తీసుకుని తనకు కాల్ చేశారని, తాను నిర్బంధంలో ఉన్నానని ( అరెస్ట్ చేశారని) చెప్పాడని వివరించారు. అరెస్ట్ చేసిన తర్వాత భర్త రిటైర్మెంట్ ను రద్దు చేశారని చెప్పారు.
జవాన్ల సౌకర్యాలు, ఆహారం, ఇతరత్రా సమస్యలను తేజ్ బహదూర్ తర్వాత సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ జీత్‌సింగ్, లాన్స్ నాయక్ యజ్ఞప్రతాప్ సింగ్ కూడా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రయత్నం మొదటగా చేసిన తన భర్తను రిటైర్ అవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని తేజ్ బహదూర్ కు ఏమైతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.
బీఎస్ఎఫ్ అధికారులు తేజ్ బహదూర్ భార్య ఆరోపణలపై స్పందించారు. బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదని, వాలంటరీ రిటైర్మెంట్ ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 30న సాయంత్రం జవాన్ రిటైర్మెంట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
(చదవండి: అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?)