మంత్రి అనిల్ విజ్ ( ఫైల్ ఫోటో)
హర్యానా: మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే నమాజ్ చేయాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం ఇలా వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఆయన కేబినెట్‌లోని మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాళీ ప్రదేశాలను ఆక్రమించే పేరుతో నమాజ్ చేయడం సరికాదని, ఆ ఉద్దేశంతో నమాజ్ చేస్తే అనుమతించేదిలేదని మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. గత రెండు వారాలుగా గుర్గావ్‌లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపట్ల హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం నిషేధించాలని ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ లాంటి పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వార్ స్పందించారు. మతపరమైన, సాంఘిక కార్యక్రమాలు అనేక ప్రదేశాల్లో జరుగుతాయని, దానికి సరిపడ స్థలం లేని సందర్భంలో బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదని అన్నారు. ముఖ్యమంత్రి అన్నివర్గాల ప్రజలను సమానంగా చూడట్లేదని, కుల, మత ప్రతిపాదికన విభజించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతపరమైన భావాలతో కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment