ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమాజ్ వద్ద కాపలాగా ఉన్న పోలీసులు
ఛండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ అనేది మసీదుల్లో, ఈద్గాల్లో చేయాలని కానీ, బహిరంగ ప్రదేశాల్లో కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. బహిరంగ ప్రదేశాల్లో నమాజు పేరిట ఉద్రిక్తతలను రేకెత్తిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. శనివారం ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, గురుగావ్ ప్రాంతంలో వారం క్రితం బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేస్తున్న వారిని హిందూ సంస్థలు అడ్డగించాయి. జై శ్రీరామ్ నినాదాలతో వారికి అంతరాయం కలిగించాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు సీఎం ఖట్టర్ స్పందించారు. ‘శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వంగా మా బాధ్యత. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అది మంచిది కాదు. రోడ్ల మీద కాకుండా మసీదుల్లోనే నమాజు చేసుకోవటం వారికి మంచిది. అలాకాకుండా వ్యవహరిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఖట్టర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు హర్యానాలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
కాగా, గుర్‌గావ్ ఘటనకు కొన్ని రోజుల ముందు సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో కొందరు ముస్లింలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా ప్రతీ శుక్రవారం పెద్ద సంఖ్యలో ముస్లింలు నమాజ్ చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నమాజ్‌లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్‌గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment