నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ : మోదీ | Narendra Modi Address The Nation | Sakshi
Sakshi News home page

నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ : మోదీ

Published Tue, Jun 30 2020 4:23 PM | Last Updated on Tue, Jun 30 2020 5:34 PM

Narendra Modi Address The Nation - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్‌ ఆఖరు వరకు ఉచిత రేషన్‌ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. జూలై నుంచి నవంబర్‌ వరకు  80 కోట్ల మందికి రేషన్‌ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. దేశంలో వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు విధానాన్ని తీసుకోస్తున్నట్టు వెల్లడించారు. ఇది వలస కూలీలకు, వారి కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు.  రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్‌ 2.0 లోకి ప్రవేశించాం. రానున్న కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. అందువల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే.. ప్రపంచంలో భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉంది. సరైన సమయంలో లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉంది. లాక్‌డౌన్‌ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడాం.

కానీ అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల నుంచి మాస్కులు ధరించడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు నిబంధనలను చాలా కఠినంగా పాటించారు. మళ్లీ ఒకసారి రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13వేలు జరిమానా విధించారు. మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి. దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు పనిచేశాయి. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్‌ అందించాం. గత కొన్ని నెలలుగా రైతులు బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా రూ. 18 వేల కోట్లు జమ చేశాం. రాబోయేది పండగల సీజన్ కావున ప్రజలకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ  క్రమంలోనే దీపావళి వరకు 80 కోట్ల మందికి పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తాం. 5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు అందజేస్తాం.గరీబ్‌ కల్యాణ్‌ యోజన పొడిగింపు కోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పన్ను చెల్లించే ప్రతి భారతీయుడి వల్లే... ఈరోజు ఇంతమంది పేదలకు సాయం చేయగలుగుతున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలి’అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement