
అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రితో మోదీ
న్యూఢిల్లీ: చర్చలకు సమయం ముగిసిందనీ, ప్రత్యక్ష చర్యలకు సమయం ఆసన్నమయిందని ప్రధాని మోదీ అన్నారు. పుల్వామా ఘటనతో చర్చలకు ఇక అవకాశం లేదని, ఉగ్రవాదంతో పాటు దానికి మద్దతు తెలిపే వారిపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే ప్రోత్సహించినట్లే అవుతుందని పాక్‌నుద్దేశించి ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రితో ప్రధాని సోమవారం చర్చలు జరిపారు. అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘పుల్వామా ఘటనతో చర్చలకు ఇక అవకాశం లేదనీ, ప్రత్యక్ష చర్యలకు సమయం ఆసన్నమైందన్న విషయం స్పష్టమైంది. ఉగ్రవాదాన్ని, దానిని ప్రోత్సహిస్తున్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో తటపటాయిస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ సహకరించు కునే వేదిక(కాంప్రిహెన్సివ్ కాన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం) ఏర్పాటుకు మోదీ, మాక్రి మద్దతు ప్రకటించారు. చర్చల సందర్భంగా రెండు దేశాలు..రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన పది ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
‘ఠాగూర్’ అవార్డుల ప్రదానం
‘ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మొనీ’ పేరిట ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రసంగిస్తూ.. భారతదేశ శక్తిని ఠాగూర్ గుర్తించారని, ఈ విషయాలను రవీంద్ర సంగీత్‌లో ప్రస్తావించారని చెప్పారు. కాగా ఠాగూర్ అవార్డులకు అర్హులైన వారిని ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. 2014, 2015, 2016 సంవత్సరాలకుగానూ ఠాగూర్ అవార్డులకు వరుసగా ప్రముఖ మణిపురీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, బంగ్లాదేశ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఛాయనౌత్, ప్రముఖ శిల్పి రామ్ వాన్జీ సుతార్‌లు ఎంపికయ్యారు. వీరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు కింద కోటి రూపాయలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment