అఫ్ఘానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.
న్యూఢీల్లీ : అఫ్ఘానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడిని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ఆప్ఘన్లోని రాయబారితో చర్చించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మోడీ తెలిపారు. కాగా హెరాత్లోని భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడిన నలుగురు దుండగులు భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. దాడి ఘటనను విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కాగా హెరాత్ నగరంలోని భారతీయ దౌత్య కార్యాలయంపై శుక్రవారం ఉదయం తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దౌత్య కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఐటీబీపీ, ఆఫ్ఘాన్ దళాలను రంగంలోకి దింపింది. దాంతో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా భారతీయ దౌత్య కార్యాలయంలోని సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని భారత్లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.