
‘యాక్ట్ ఈస్ట్’లో తొలి అడుగు
మూడు దేశాలు, మూడు శిఖరాగ్ర సదస్సులు, దాదాపు 40 మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీలు.. ...
మయన్మార్‌లో నరేంద్ర మోదీ
నేపితా/న్యూఢిల్లీ: మూడు దేశాలు, మూడు శిఖరాగ్ర సదస్సులు, దాదాపు 40 మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీలు.. ఇవన్నీ భాగమైన 10 రోజుల విస్తృత విదేశీ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మొదట ఆయన మయన్మార్ చేరుకున్నారు. నేపితా విమానాశ్రయంలో ఆ దేశ ఆరోగ్యమంత్రి థాన్ ఆంగ్, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు మోదీకి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధ్యక్ష భవనంలో మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భేటీ అద్భుతంగా జరిగిందని, పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చించామని సమావేశం అనంతరం మోదీ ట్వీట్ చేశారు. రవాణా, వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయన్నారు.
భారత్‌ను తమ దేశాభివృద్ధికి సహకరించే సోదరదేశంగా మయన్మార్ భావిస్తుందని మోదీతో భేటీ సందర్భంగా థీన్ సీన్ పేర్కొన్నారు. భారత్, మయన్మార్, థాయ్‌లాండ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న 3,200 కి.మీ.ల రహదారి పొడవునా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు విషయంపై వారిరువురూ చర్చించారు మణిపూర్‌లోని మోరే నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్‌లోని మేసోట్ వరకు ఉండే ఆ రహదారి నిర్మాణం 2018లో పూర్తికానుంది. మోదీ ఇక్కడ బుధవారం ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో, గురువారం తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఆస్ట్రేలియాలో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రిస్బేన్ వెళ్తారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఫిజీ దేశంలో పర్యటిస్తారు.
ఆసియాన్‌తో గాఢమైన అనుబంధం
భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ఆసియాన్ దేశాలతో సంబంధాలు చాలా కీలకమని మయన్మార్ వెళ్లేముందు మోదీ పేర్కొన్నారు. మరింత లోతైన ద్వైపాక్షిక సంబంధాలకు మార్గం చూపేలా ఆయా దేశాలతో తన చర్చలు ఉంటాయని వ్యాఖ్యానించారు. 2016 నుంచి ప్రారంభం కానున్న ఆసియాన్- భారత్ పంచవర్ష ప్రణాళిక అమలుపై భారత్ చాలా ఆసక్తిగా ఉంద భారత అధికారులు పేర్కొన్నారు. ఆసియాన్‌లో బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాంలు సభ్యదేశాలు.
తూర్పు ఆసియా సదస్సులో.. ఇండియా ఆసియాన్ సదస్సు అనంతరం గురువారం 18 దేశాలు పాల్గొంటున్న తూర్పు ఆసియా సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఆసియాన్ దేశాలతో పాటు ఆ సదస్సులో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజీలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా దేశాలు పాల్గొంటున్నాయి.