మా ఇంటికి కిటికీలు ఉండేవి కావు: మోదీ
లక్నో: 'చాలా పేద కుటుంబుంలో పుట్టి పెరిగాను. మా ఇంటికి కిటికీలు కూడా ఉండేవి కావు. ఇంట్లో వంట కట్టెల పోయ్యిపై అమ్మ వంట చేయాల్సి వచ్చేది' అని ప్రధాని నరేంద్ర మోదీ తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. ఉత్తరప్రదేశ్ లోని బాలియాలో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన మరికొన్ని అంశాలు... మొత్తం 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని పేర్కొన్నారు. మహిళల పేరిటే ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమ్మ కష్టాలు చూసిన వాడ్ని కనుక మహిళల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి మాత్రమే ఆలోచించాయి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు పనిచేయలేదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.