ఇక బినామీల భరతం!
• ఆ ఆస్తులపై త్వరలోనే కఠినచట్టం తీసుకొస్తాం: మోదీ
• నోట్లరద్దు నియమాల మార్పుల్లో మేం చేస్తోంది కరెక్టే!
• అవినీతి, నల్లధనాన్ని సమర్థిస్తున్నవారే ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు
• యుద్ధం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
• ప్రజల సాయంతోనే అక్రమార్కుల ఆట కట్టిస్తున్నామన్న ప్రధాని
అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందే. దీన్ని ఆపడం, పలాయనం చిత్తగించడం వంటి ప్రశ్నలకు చోటే లేదు.
మేం బినామీ చట్టాన్ని పలు మార్పులతో మళ్లీ తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చట్టం అమలు మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాల్సిన, జరగాల్సిన పనులన్నీ ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం.
– ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం అమలు తర్వాత పరిస్థితిని బట్టి నియమ నిబంధనల్లో తీసుకొస్తున్న మార్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థించుకున్నారు. అవినీతి, నల్లధనాన్ని సమర్థిస్తున్నవారే నిరంతరం ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన రేడియో ప్రసంగంలో.. నోట్లరద్దు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను మోదీ వెల్లడించారు.
బినామీ ఆస్తులపై కఠినచట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ‘అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందే. దీన్ని ఆపటం, పలాయనం చిత్తగించటం వంటి ప్రశ్నలకు చోటే లేదు’ అని మోదీ వెల్లడించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా నోట్లరద్దు నిర్ణయం తర్వాత డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌పై తరచూ నిబంధనలు మార్చటం సరైనదేనన్నారు. ప్రజల సమస్యలను తగ్గించి.. నోట్లరద్దును వ్యతిరేకిస్తున్న శక్తుల ఆటకట్టించేందుకే నిబంధనలు మార్చాల్సి వచ్చిందన్నారు.
ప్రజలే పట్టిస్తున్నారు
‘సున్నితమైన ప్రభుత్వంగా.. ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు వీటికి పరిష్కారం సూచిస్తూ ముందుకెళ్లటం మా కర్తవ్యం. అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్నవారు, విశ్వాసఘాతకుల కుట్రలనూ భగ్నం చేస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. అవినీతిపై చేస్తున్న యుద్ధంలో ప్రజలంతా సహకరించాలని మోదీ కోరారు. నోట్ల రద్దు తర్వాత కొందరు అక్రమార్కుల గురించి ప్రజలే సమాచారం ఇచ్చారని ప్రశంసించారు. తమను తప్పుదోవ పట్టిస్తున్న వారికీ సరైన బుద్ధి చెబుతున్నారన్నారు. రాజకీయ పార్టీలు అన్ని రకాల మినహాయింపులను పొందుతున్నాయంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని.. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. నోట్లరద్దుపై రకరకాల కుట్రలు పన్నుతున్నారని చివరకు మతం రంగు కూడా పులిమారన్నారు. ఇలాంటి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవినీతి, అక్రమ వ్యాపారాలు, నల్లధనం వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
విపక్షాల తీరు బాధాకరం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు ప్రజలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందన్నారు. ప్రభుత్వం నోట్లరద్దుతోపాటు రాజకీయ పార్టీలకు నిధులపైనా చర్చజరగాలని కోరుకుందని మోదీ తెలిపారు. 1988లోనే కాంగ్రెస్ పార్టీ బినామీ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇంతవరకు దీని అమలుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయలేదన్నారు. ‘మేం బినామీ చట్టాన్ని పలు మార్పులతో మళ్లీ తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చట్టం అమలు మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాల్సిన, జరగాల్సిన పనులన్నీ ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం’ అని మోదీ స్పష్టం చేశారు.