బినామీలపై ఉక్కుపాదం
కొందరు సామాన్యుల ఖాతాలను వాడుతున్నారు
- మాసాంతపు మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
- నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా సహకరిస్తున్నారు
- యూపీ ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై ధ్వజం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకంతో జన్‌ధన్ అకౌంట్లలో డిపాజిట్లు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సామాన్యుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్న వారిని కఠినంగా శిక్షించేందుకు బలమైన బినామీ చట్టాలను అమలుచేయనున్నట్లు హెచ్చరించారు. మాసాంతపు ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ.. ప్రజలు నగదు రహిత ఆర్థిక లావాదేవీలవైపు యోచించాలని, యువత ఈ దిశగా సామాన్యులను, పెద్దలను చైతన్యపరచాలన్నారు. నోట్లరద్దును అమలుచేసిన తర్వాత జరిగిన తొలి మన్‌కీ బాత్ ప్రసంగంలో దీని గురించే ఎక్కువసేపు మాట్లాడారు. ‘ఇప్పటికీ చాలా మంది తమ నల్లడబ్బును బయటకు తీసేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పేదలను, వారి ఖాతాలను వినియోగించుకుంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు బినామీ కఠినచట్టాలు అమల్లో ఉన్నారుు. ఇలాంటి డిపాజిట్ల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడాలని ప్రభుత్వం అనుకోవటం లేదు’ అని మోదీ తెలిపారు.
ఎంతవారైనా వదలం.. అవినీతిపరులు, నల్లధనం కలిగున్న వారంతా నిబంధనలు పాటించాలా వద్దా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్న మోదీ.. తప్పుచేసిన వారు ఎంతవారైనా చట్టం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పేదల జీవితాలతో ఆడుకునేందుకు ప్రయత్నించొద్దన్నారు. అవినీతిపరుల వల్ల పేదలు విచారణకు హాజరై ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు. దేశంలో అవినీతిని అంతమొందించాలన్న దృఢసంకల్పంతో సామాన్యులు, రైతులు ఇలా సమాజంలోని అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. విపక్షాలు, పలు సంస్థలు నోట్లరద్దుపై ఎంత విషప్రచారం చేసినా.. ఉజ్వల భారతం కోసం ప్రజలు త్యాగాలు చేస్తున్నారన్నారు. యువతను నిజమైన సైనికులుగా అభివర్ణించిన మోదీ.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడంలో ముందుండాలని సూచించారు.
‘నగదు రహితం’దిశగా.. ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చటం మన కల. దీన్ని తక్షణమే అందుకోవటం సాధ్యం కాదు. కానీ భారత్ దీన్ని సాధించి తీరుతుంది. తక్కువ నగదు వాడకాన్ని అలవాటు చేసుకోవటం ద్వారా నగదు రహిత సమాజాన్ని చేరుకోవటం పెద్ద కష్టమేం కాదు’ అని మోదీ తెలిపారు. 70 ఏళ్ల భారతంలో మొదట్నుంచీ నిండిపోరుున అవినీతిపై పోరు అంత సులభమేం కాదన్నారు. కొంతకాలం క్రితం కశ్మీర్ పంచాయతీ పెద్దలు తనను కలసి లోయలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కశ్మీర్‌లో బోర్డు పరీక్షల్లో 95% మంది విద్యార్థులు హాజరవటాన్ని ప్రశంసించారు. బంగారు భవిష్యత్తుకోసం వారు చేస్తున్న యత్నాలకు ఇదో నిదర్శనమన్నారు.
మరో 30 రోజుల గడువుంది
కుశీనగర్: యూపీలోని కుశీనగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని విపక్షాలపై నిప్పులు చెరిగారు. అవినీతిని రూపుమాపే ప్రయత్నానికి విపక్షాలు సహకరించకపోగా భారత్ బంద్ చేద్దామంటున్నాయన్నారు. ‘భారత్ బంద్ ద్వారా నల్లధనం, అవినీతి రూపుమాసిపోతాయా?’ అని సభికులను ప్రశ్నించారు. నోట్ల రద్దుతో ప్రస్తుతానికి సమస్యలు ఉన్నా.. భవిష్యత్తు బాగుంటుందన్నారు. బ్యాంకు, ఏటీఎం సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఈ-వాలెట్(మొబైల్ బ్యాంకింగ్)ను అలవాటు చేసుకోవాలన్నారు. ‘మొబైల్ రీచార్జ్ చేసేందుకు, వాట్సప్ వాడేందుకు ప్రత్యేకంగా స్కూలుకు వెళ్లి నేర్చుకోలేదు.
వాట్సప్ ఎలా వినియోగించాలోకూడా మనమే నేర్చుకున్నాం. మొబైల్ బ్యాంకింగ్ కూడా ఇలాంటిదే. ‘సమస్యలు వస్తాయని ముందుగానే చెప్పాను అందుకే మీ నుంచి 50 రోజుల గడువడిగాను. ఇంకా 30 రోజులు మిగిలున్నారుు. ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది’అని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ పూర్తిగా పేదలు, రైతులు, గ్రామీణప్రాంతాల వారు, దళితుల కోసమే అంకితమైందన్న మోదీ.. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలను అమలుచేయటంలో యూపీలోని సమాజ్‌వాదీ సర్కారు ఆసక్తి చూపటం లేదని విమర్శించారు. ‘మిమ్మల్ని మోసం చేయను. నాపై నమ్మకం ఉంచినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నా’నని అన్నారు.