వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్ కాలపరిమితి ముగిసిన ఏప్రిల్ 14 తరువాత ఈ దేశవ్యాప్త దిగ్బంధాన్ని దశలవారీగా ఎత్తివేసే దిశగా ఆలోచిస్తున్నట్లు గురువారం ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫెరెన్స్‌లో వెల్లడించారు. ఏప్రిల్ 14 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేసి, ఆ తరువాత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ దశలవారీగా ఎత్తివేసేందుకు ఒక నిష్క్రమణ వ్యూహాన్ని రూపొందించాల్సి ఉందని సీఎంలతో ఆయన వ్యాఖ్యానించారు. అందుకు అవసరమైన సూచనలను ఇవ్వాల్సిందిగా ఆయన సీఎంలను కోరారు. (లాక్డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు )
సాధారణ స్థితి నెలకొనేవరకు సమన్వయ పూరిత నిష్క్రమణ వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న వారాల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ(టెస్ట్), అనుమానితుల గుర్తింపు(ట్రేస్), వారిని ఐసోలేట్ చేయడం, క్వారంటైన్ చేయడం అనే అంశాలపై నిశిత దృష్టి పెట్టాలని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ప్రాణ నష్టాన్ని అత్యంత కనిష్ట స్థాయికి చేర్చడమే అందరి ఉమ్మడి లక్ష్యం కావాలన్నారు. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ కాలం ముగిసిన తరువాత సాధారణ స్థితికి వచ్చేందుకు సమన్వయ పూరిత నిష్క్రమణ వ్యూహాన్ని అమలు చేయాలని, ఆ దిశగా తమకు సూచనలు చేయాలని కోరారు.
కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు.. తదితర అంశాలపై గురువారం మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ హాట్ స్పాట్స్‌ను గుర్తించడం, ఆ ప్రాంతాలను నిర్బంధించి, అక్కడి నుంచి వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని సీఎంలను ఆదేశించారు. అలాగే, వ్యవసాయం సహా వెసులుబాటు కల్పించిన రంగాల్లోనూ భౌతిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేయాలని కోరారు.
పరస్పర ప్రశంసలు
కరోనాపై పోరులో కేంద్రానికి రాష్ట్రాలు అద్భుతంగా సహకరిస్తున్నాయని, అందుకు కృతజ్ఞతలని పీఎం చెప్పారు. రాష్ట్రాల సహకారంతో కరోనాపై పోరులో కొంత విజయం సాధించగలిగామన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నిరోధించడంలో తాము చేపట్టిన చర్యలను రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. నిజాముద్దిన్ మర్కజ్‌కు వెళ్లిన వారిని ట్రాక్ చేయడం, సంబంధీకులందరినీ క్వారంటైన్ చేయడం, ప్రజలంతా లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించేలా చూడటం, ఔషధాలు ఇతర నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం సహా.. తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ వైరస్‌పై పోరులో ఆర్థికంగా, వైద్యపరంగా వనరులనందించి రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. కరోనాపై పోరాటంలో ప్రధాని చూపిన నాయకత్వ ప్రతిభను ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు కొనియాడా రు. సరైన సమయంలో సాహసోపేతంగా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారని, ఈ సంక్షోభ సమయంలో క్రమం తప్పకుండా రాష్ట్రాలకు సూచనలు, సలహాలు ఇచ్చారని ప్రశంసలు కురిపించారు.
నిత్యావసరాలపై దృష్టి
అంతర్జాతీయంగా ఈ వైరస్‌పై పోరు అంత ఆశాజనకంగా లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాల్లో రెండో సారి వైరస్ విజృంభించే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఔషధాలు సహా అత్యవసర వైద్య ఉత్పత్తులను, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్–19 పేషెంట్ల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూడాలన్నారు. కోవిడ్ 19 మన విశ్వాసాలపై దాడి చేసి, మన జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్, హోంమంత్రి అమిత్ షా, పలు కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సహా దేశంలో కోవిడ్–19 కేసుల విస్తరణకు కారణాలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ వివరించారు. కేసులు భారీగా నమోదైన జిల్లాలపై దృష్టి పెట్టాలని, అక్కడి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రులతోపాటు ఆయా రాష్ట్రాల హోం మంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోంశాఖ, ఆరోగ్య శాఖల కార్యదర్శులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment