అరేబియా సముద్రంలో నిసర్గ తుపానుపై నాసా విడుదల చేసిన శాటిలైట్ చిత్రం
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మరో 12 గంటల్లో నిసర్గ తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర మహారాష్ట్రను దాటి, దక్షిణ గుజరాత్‌లోకి ప్రవేశించి, అలీబాగ్ వద్ద హరిహరేశ్వర్, డామన్‌ల మధ్య జూన్ 3వ తేదీ సాయంత్రం తీరందాటే అవకాశం ఉన్నదని, తీరందాటే సమయంలో గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.ఎస్.హసలీకర్ హెచ్చరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కి చెందిన 14 జాతీయ విపత్తు సహాయక బృందాలు తీరప్రాంతాల్లో రక్షణచర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరో ఐదు బృందాలను ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో రప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తుపానుని ‘నిసర్గ’గా పిలుస్తున్నారు. నిసర్గ పేరుని బంగ్లాదేశ్ సూచించినట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడించారు.
గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్‌సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 13 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 6 స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ తుఫాన్ సహాయక చర్యల్లో ఉన్నట్టు అధికారి హర్షద్ పటేల్ అహ్మదాబాద్‌లో వెల్లడించారు. వారికి 140 భవనాల్లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో సహాయక బృందాలు పీపీఈ కిట్లను ధరించాలనీ, షెల్టర్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.
నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్‌డీఆర్‌ఎఫ్ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జూన్ 1 నాటికి ముంబైలో నమోదైన 41,099 కేసులతో సహా మహారాష్ట్రలో 70,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మూలిగే నక్కపైన తాటికాయపడ్డ చందంగా ఇప్పుడు తుపాను తాకిడికి మహారాష్ట్ర మరింత అతలాకుతలం కానుంది. ముంబై నగరంలోని థానే, పాల్‌ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధు దుర్గ్ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోనూ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాననీ, ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు వహించాలని ప్రధాని ట్వీట్ చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఉన్న 150 మంది కోవిడ్ పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
కేరళలో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఒక రోజు తరువాత కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. రాష్ట్ర రాజధానితో సహా ఏడు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. ఈ ప్రాంతాల్లో 6.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం, 11.5 సెంటీమీటర్ల నుంచి 20.4 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment