
'గతం గుర్తుచేసుకుని బాధ పడాల్సినవసరం లేదు'
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. అమృత్, అందరికీ గృహాలు, స్మార్ట్ సిటీస్ మిషన్ పథకాలను న్యూఢిల్లీలో గురువారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. వీటిలో భాగంగా 100 ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని పథకాలు రూపొందిస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడగలమా అన్న సందేహం వద్దని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా ముందడుగు వేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నగరాలు ఎలా అభివృద్ధి చెందాలన్నదానిపై చర్చిద్దామని, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడాల్సిన అవసరంలేదన్నారు. పేదోళ్లకు ఇళ్లు కట్టించడమే కాదు, ఆత్మవిశ్వాసంతో బతికేలా చేద్దామని ప్రధాని మోదీ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో 5 ఆకర్షణీయ నగరాలు, అమృత్ పట్టణాల ఆధునికీకరణను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఆకర్షణీయ నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన ఒక్కో నగరానికి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.