
అంబులెన్సు కోసం కాన్వాయ్ ఆపించిన మోదీ
దేశంలో ఒకరో ఒకరిద్దరు మాత్రమే వీఐపీలు కారని, ప్రజలంతా వీఐపీలేనని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. దాన్ని ఆచరణలో చూపించారు. అంబులెన్సుకు దారి ఇవ్వడం కోసం ఆయన తన కాన్వాయ్‌ని ఆపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 52వ వార్షిక సమావేశాలను ప్రారంభించేందుకు మోదీ అక్కడకు వెళ్లారు. ఈ కార్యక్రమం అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యమైంది. దాంతో వేగంగా తిరిగి వెళ్తున్న ప్రధాని మోదీ.. దారిలో గాంధీనగర్ - అహ్మదాబాద్ మార్గంలో రోడ్డుమీద ఒక అంబులెన్సును చూశారు.
దాంతో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, తన కాన్వాయ్ మొత్తాన్ని పక్క లేన్‌లోకి తీసుకెళ్లి ఆపాల్సిందిగా ఆదేశించారు. అంబులెన్సును ముందుగా పంపించాలని తెలిపి, దానికి దారిచ్చి.. అది వెళ్లిపోయిన తర్వాత మళ్లీ తన ప్రయాణం కొనసాగించారు. ఉన్నతాధికారులు, మంత్రుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని, తద్వారా వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలని మోదీ గత నెలలో చెప్పిన విషయం తెలిసిందే. కేవలం ఎర్రబుగ్గలు తీసేస్తే చాలదని, ప్రవర్తనలో కూడా మార్పు రావాలని స్వయంగా చేసి చూపించిన ప్రధానిపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.