మోదీ ఆలింగనంపై విపరీతార్థాలు
హైదరాబాద్: ప్రముఖులు కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ఆలింగనం చేసుకోవడంపై ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను మోదీ హత్తుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు చేసిన విపరీతార్థాలు, వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో చిలువలు పలువలుగా చూపించి హల్ చల్ చేసే ప్రయత్నం చేసింది.
సాధారణంగా చిన్నవ్యక్తి కావొచ్చు.. పెద్ద వ్యక్తి కావచ్చు.. చిరుద్యోగి కావొచ్చి.. పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగి కావొచ్చు.. గల్లీ నాయకుడు కావొచ్చు.. ప్రపంచ నేత అయ్యుండొచ్చు.. వీళ్లలో ఎవరూ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లినా, మోదీ వారిని కలిసేందుకు వెళ్లినా అక్కడ జరిగే మొట్టమొదటి పని ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా వాత్సల్యంతో పాటు సందర్భానుసారం అర్థం ఉంటుంది. ఒకరికొకరం భరోసా అని చెప్పుకోవడం కూడా దాని ఉద్దేశం అయి ఉంటుంది.
భారతీయ సంప్రదాయంలో ఇమిడి ఉన్న ఈ అంశాన్ని పెద్దగా బయటకు కనిపించకపోయినా చాలామంది పాటిస్తూనే ఉంటారు. అయితే, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ కాస్త వక్రీకరించిన రీతిలో వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో ఒక కథనాన్ని వెలువరించింది. మోదీ అభ్యంతరకరంగా అనిపించేలా ఏ నేతను వదిలిపెట్టకుండా అందరినీ హగ్ చేసుకుంటున్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఇది తన సొంత ఉద్దేశం కాదని చెప్పేందుకు... మోదీ ఇతర దేశాల నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలపై కొందరు వ్యక్తుల నెగెటివ్ స్పందనను జత చేసి ట్యాగ్స్ ఆ కథనానికి తగిలించింది.
ముఖ్యంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయను ఆలింగనం చేసుకున్నప్పటి ఫొటోలను ఉద్దేశిస్తూ కొందరు ట్విట్టర్లో చేసిన కామెంట్లను ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. అందులో మోదీ ఆలింగనం చేసుకున్న విధానం ఎబ్బెట్టుగా ఉందన్నారు.. దీంతో హోలాండే తప్పించుకునేందుకు వెనక్కి తిరిగారు కానీ... అంటూ రాశారు.
మరో ఫొటోలో మోదీ, హోలాండే గుర్రం ఎక్కి ఉన్నట్లుగా ఒక ఫొటో చూపిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ హోలాండ్ పానిపట్కు వెళ్లే మార్గంలో... అని సోషల్ మీడియాలో ఒకరిద్దరి కామెంట్స్ ఆధారంగా కథనం అల్లేశారు. హోలాండే వెనుక భాగంలో మోదీ ఉన్న ఫోటోను టైటానిక్ లో హీరో హీరోయిన్ ఫొటోతో పోల్చారు. షిప్ లేకుండా నేలపై టైటానిక్ చిత్రంలోని ఫేమస్ సీన్ చూపించిన ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరే.. మరో ఫొటోను చూపిస్తూ.. ఇంత దగ్గరిగానా ఇక చాలు.... అంటూ కామెంట్స్ పోస్టు చేశారు.
మరొకరు మాత్రం ఆలింగనం అనేది ఫ్రెంచ్ సంస్కృతి కాదని మోదీకి ఎందుకు తెలియజేయలేదు.. అది కూడా వెనుక నుంచి.. వెనుక నుంచి హోలాండ్ను హగ్ చేసుకోవడం ఏవగింపుగా అనిపించడం లేదా అంటూ మరో వ్యక్తి చేసిన ట్వీట్ను అందులో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆయా నాయకులను ఆలింగనం చేసుకున్న ఫొటోలను పెట్టారు.