కశ్మీరీ స్వాతంత్య్రానికి మద్దతు
పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్య.. ప్రజలపై దుష్కృత్యాలను ప్రపంచం సమీక్షించాలని వినతి
ఇస్లామాబాద్: కశ్మీరీ ప్రజల దుస్థితిని ప్రపంచం పట్టించుకోవాల్సిన అవసరముందని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీ ప్రజల స్వాతంత్య్రోద్యమానికి తమ ప్రభుత్వం నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. త్వరలో పదవీ కాలం ముగియనున్న పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అధ్యక్షుడు సర్దార్ ముహమ్మద్ యాకూబ్‌ఖాన్ మంగళవారం తనను కలసిన సందర్భంగా నవాజ్ పై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పీవోకే ఎన్నికల్లో నవాజ్‌షరీఫ్‌కే చెందిన పాక్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ గెలిచింది.
పీవోకే ప్రధానిగా రాజా ఫరూక్ హైదర్‌ను, అధ్యక్షుడిగా మసూద్‌ఖాన్‌ను నవాజ్ నియమించారు.యాకూబ్‌తో భేటీలో నవాజ్ మాట్లాడుతూ.. ‘నిరాయుధులైన అమాయక కశ్మీరీలపై తాజాగా జరుగుతున్న క్రూరకృత్యాలను ప్రపంచం సమీక్షించాల్సిన అవసరముంది. కశ్మీరీలు స్వాతంత్య్రమనే తమ అవిభాజ్య హక్కు కోసం భారీ త్యాగాలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. కశ్మీరీల స్వతంత్ర పోరుకు సంపూర్ణ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇవ్వాలన్న తమ సర్కారు సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. భారత ప్రధాని మోదీ తన పంద్రాగస్టు ప్రసంగంలో కశ్మీర్, పీఓకే అంశాలపై పాక్‌ను విమర్శించిన నేపథ్యంలో షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మోదీతో అమెరికా, యూరప్‌లు గళం కలపాలి: బలూచ్ నేతలు
వాషింగ్టన్: బలూచ్ అంశంపై మోదీతో గళం కలపాలని, బలూచ్‌లో పాక్ సర్కారు అణచివేతకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా, యూరప్‌లను బలూచ్ ఉద్యమ నేత లు ఖలీల్ బలూచ్, బ్రహుమ్ బుగ్తీలు కోరారు.
హక్కుల ముసుగులో ఉగ్ర చేయూత: అక్బర్
న్యూయార్క్: ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ దానికి మానవహక్కుల ముసుగు వేయడం అత్యంత హేయమైనదని విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాక్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంతో మానవ హక్కులకు పెను ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ జరిగిన 70వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు.‘స్వేచ్ఛగా ఓటు వేయడానికే కాదు... భావాన్నీ వ్యక్తం చేసుకోగల స్వాతంత్య్రం ఉండాలి. భారతీయ ముస్లింగా నేను గర్వపడుతున్నా. దేశంలో పధ్నాలుగు వందల ఏళ్లుగా అజాన్(నమాజ్ పిలుపు) వినిపిస్తోంది. భవిష్యత్తులో కూడా వినిపిస్తూనే ఉంటుంది’ అని అన్నారు. కాగా, బలూచ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానుల్లోమోదీయే మొదటి వారు కాదని.. గతంలో మన్మోహన్ కూడా మాట్లాడారని కాంగ్రెస్ పేర్కొంది.
పాక్‌కు వెళ్లటమంటే నరకంలోకి వెళ్లినట్టే: పరీకర్
రేవారి (హరియాణా): పాక్‌తో సంబంధాలు మరింతగా దిగజారుతున్న నేపథ్యంలో.. ‘పాక్ వెళ్లటమంటే నరకంలోకి వెళ్లటం వంటిదే’ అని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. సోమవారం పలువురు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని, దానిని భారత సైన్యం తిప్పికొట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనీ ఉద్ఘాటించారు. బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పాక్ ఆపివేయాలన్నారు.
ఆయన మంగళవారం రేవారిలో మాట్లాడుతూ.. పాక్ ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని దాని పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి దాడికీ భారత సైనికులు తగిన సమాధానం ఇస్తారని రక్షణమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పీవోకే, గిల్గిత్, బలూచిస్తాన్‌లలో మానవ హక్కుల ఉల్లంఘనల విషయాన్ని ప్రస్తావిస్తూ పాక్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. పరీకర్, ప్రణాళికా శాఖ స్వతంత్ర సహాయమంత్రి, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ సహాయమంత్రి రావు సింగ్‌రావు ఇందర్‌జిత్‌లు 1857 భారత తిరుగుబాటులో కీలక నేతల్లో ఒకరైన రావు తులారామ్ జన్మస్థలాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఇస్లామాబాద్ సార్క్ సదస్సుకు జైట్లీ వెళ్లరు?
న్యూఢిల్లీ: ఈ నెల 25, 26న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగనున్న సార్క్ దేశాల ఆర్థికమంత్రుల సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హాజరుకాకపోవచ్చునని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ‘రాజకీయ కారణాల వల్లే ఆయన ఈ భేటీకి దూరంగా ఉండొచ్చు. ఇదివరకు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో మీకందరికీ తెలుసు’ అని అన్నాయి. ఈ నెల ఆరంభంలో సార్క్ హోంమంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇస్లామాబాద్ వెళ్లినప్పడు జరిగిన సంఘటనలను ప్రస్తావించాయి.
ఆ భేటీలో.. రాజ్‌నాథ్, పాక్ అంతర్గత మంత్రి చౌదరి నిసార్ లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పీటీఐ, దూరదర్శన్ సహా భారత మీడియా ప్రతినిధులు ఎవరినీ సార్క్ హోంమంత్రుల సమావేశ వేదికలోకి పాక్ అనుమతించలేదు. సమావేశం అనంతరం తిరిగి వచ్చిన రాజ్‌నాథ్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ.. సార్క్ భేటీకి హాజరైన వారిని నిసార్ మధ్యాహ్య విందుకు ఆహ్వానించి కారులో వెళ్లిపోయారని.. తాను దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో అది చేశానన్నారు.