
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వరద ముంపుపై మొదటి నుంచి పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేసినా ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు మాత్రం వరద ముప్పు ఉందని పరోక్షంగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు.
వరద ముంపు నిర్వహణ నిమిత్తం రూ.1096 కోట్లు అవసరమన్న ఎంపీ గల్లా జయదేవ్.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, వరదనీరు మళ్లింపునకు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు రుణాల కోసం కేంద్ర జలవనరులశాఖకు ఫైలు పంపిన టీడీపీ ఎంపీలు ఆమోదం తెలపాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.