ప్రముఖులపై సీబీఐ దాడులు చేస్తే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ కార్యాలయంలో మంగళవారం సీబీఐ జరిపిన దాడులపై కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శల యుద్ధం జరుగుతుండగా, ట్విట్టర్ యూజర్లకు మాత్రం ఇది పెద్ద హాస్య సన్నివేశంగా మారింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాజేంద్ర కుమార్ కార్యాలయమంతా గాలించి, శోధించి సీబీఐ అధికారులు చివరకు పైరసీ డీవీడీ సినిమాలు స్వాధీనం చేసుకున్నారంటూ తొలుత స్పందించిన ట్విట్టర్లు మరో అడుగు ముందుకేసి ప్రముఖులపై దాడులు చేస్తే ఎవరి వద్ద ఏమి దొరుకుతాయనే విషయంలో వ్యంగ్యోక్తులతో హాస్యం పండిస్తున్నారు.
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్‌పై దాడులు చేస్తే మూడేళ్లకు సంబంధించిన విదేశీ యాత్రల టిక్కెట్లు, అక్కడ నిర్వహించే కార్యక్రమాల ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లాన్లు దొరకుతాయి....ఫొటోషాప్ పైరేటెడ్ వర్షన్ దొరుకుతుంది....తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిపై సీబీఐ దాడిచేస్తే, వెళ్లేటప్పుడు అమ్మ బొమ్మ స్టిక్కర్లు అతికించి పంపుతుంది....కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇంటిపై దాడిచేస్తే బోలడన్ని డిగ్రీలు.....వీకే సింగ్ ఇంటిపై దాడిచేస్తే బోలడన్ని బర్త్ సర్టిఫికెట్లు దొరకుతాయి....బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడిచేస్తే డ్రైవర్‌లెస్ కారు దొరకుతుంది....ఆమిర్ ఖాన్ ఇంటిపై దాడిచేస్తే అసహనంపై స్క్రిప్టులు, ఇంటి వెనకాల టాంకు నిండా మొసలి కన్నీళ్లు దొరకుతాయి....ఆజం ఖాన్ ఇంటిపై దాడిచేస్తే గడ్డి మేస్తున్న బర్రెలు దొరుకుతాయి’ అంటూ ట్వీట్లపై ట్వీట్లు విసురుతున్నారు.