కొత్త ఏడాదిలో నూతన పురోగతి
- భారత్-చైనాల సంబంధాలపై జిన్‌పింగ్
- విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ
బీజింగ్: ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన పురోగతి దిశగా భారత్-చైనాలు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ బంధాన్ని బలోపేతం చేసేందుకు కొత్త ఏడాదిలో నూతన పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సోమవారం బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’లో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో తన భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుపైనా ఆమెతో చర్చించారు. తాను భారత్‌లో పర్యటించినప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలు కొత్త అధ్యాయంలోకి ప్రవేశించాయన్నారు. భారత పర్యటనలో మోదీ ప్రభుత్వం, భారతీయులు తనకు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని జిన్‌పింగ్ గుర్తుచేసుకున్నారు. భారత ప్రధాని మోదీ ఆయన స్వరాష్ట్రమైన గుజరాత్‌కు తనను స్వయంగా వెంట తీసుకెళ్లడాన్ని ప్రస్తావించారు.
స్వదేశానికి తిరిగి వెళ్లాక భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, మోదీకి తన శుభాకాంక్షలు తెలపాల్సిందిగా సుష్మను కోరారు. ఇందుకు సుష్మ స్పందిస్తూ ఈ నెల 19తో మొదలయ్యే చైనా నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని చైనీయులకు శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పారు. సిక్కిం మీదుగా టిబెట్‌లో కైలాస్ మానససరోవర యాత్రకు మరింత మంది భారతీయులను అనుమతించేలా రెండో మార్గాన్ని తెరవడానికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలను ఇరు దేశాలు ఆదివారం ఇచ్చిపుచ్చుకోవడం సుష్మ పర్యటనలో కీలక పరిణామంగా పేర్కొనవచ్చు.
కాగా, ఉగ్రవాద దాడులకు పాల్పడే వారితోపాటు ఉగ్రవాదాన్ని పెంచిపోషించే వారిని చట్టం ముందుకు తీసుకురావాలని రష్యా, భారత్, చైనాల కూటమి(ఆర్‌ఐసీ) డిమాండ్ చేసింది. సోమవారమిక్కడ 13వ ఆర్‌ఐసీ భేటీలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు సెర్గె లావ్‌రోవ్, వాంగ్ యీలతో కలసి సుష్మ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో అంతర్జాతీయ చట్టాల్లో ఉన్న లొసుగులను సరిదిద్దేందుకు ఐరాసలో భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పంద తీర్మానంపై త్వరగా తేల్చాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.