సాక్షి, పట్నా: బిహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో భారీ వరదల కారణంగా కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి ఎదురైంది. వివాహం అనంతరం వరుడితో కలిసి వధువు ఇంటికెళుతున్న సమయంలో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఫలితంగా కారు ప్రయాణం కష్టంగా మారింది. దీంతో స్థానికులు ప్లాస్టిక్ డ్రములతో తయారుచేసిన ఓ నాటు పడవలో వధూవరులను అక్కడి నుంచి రోడ్డు దాటించి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బిహార్‌కు వరద ముప్పు
నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా సరిహద్దు రాష్ట్రమైన బిహార్ వరద ముప్పులో చిక్కుకుంది. బిహార్‌లోని 6 జిల్లాలు వరదమయమయ్యాయి. సుపాల్, మజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా, కిషన్ గంజ్ జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పరీవాహక ప్రాంత గ్రామాల్ని ముంచెత్తుతున్నాయి. దీంతో వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని స్థానిక యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి, గండక్, బుది గండక్, గంగ, భాగమతి నదుల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని బిహార్ సీఎం నితీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అల్లాడుతున్న అసోం
వరద ఉధృతితో అసోం అల్లాడుతోంది. బ్రహ్మపుత్ర సహా 5 ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతూ ఊళ్లను ముంచెత్తుతున్నాయి. వరదల వల్ల అసోంలో మృతిచెందినవారి సంఖ్య ఇప్పటికే 7కు చేరింది. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలో 14 లక్షలమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని రాష్ట్ర అధికారులు తెలిపారు. 2వేలకుపైగా గ్రామాలు నీటిముంపులో ఉన్నాయి. కజిరంగా జాతీయ పార్క్70శాతం మునిగిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితిని సీఎం సరబానంద సోనోవాల్ వివరించారు.
అసోంలో వరదల ధాటికి ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. మోరేగావ్ జిల్లా తెంగాగురిలో స్కూల్ బిల్డింగ్ క్షణాల్లో నేలమట్టమైంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది వరద
జనావాసాల్లోకి చేరడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. భారీ వర్షాలతో పొరుగు దేశం నేపాల్ విలవిల్లాడుతోంది. గత 5 రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు నదులు పోటెత్తుతున్నాయి. వరద పొంగిపొర్లడంతో కొండప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ముప్పు నెలకొంది. వరదల్లో చిక్కుకుని, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకూ 50మంది మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయ్యారు. మరో 12మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. లలిత్‌పూర్, ఖోతంగ్, భోజ్‌పూర్, కావ్రే, మాక్వాన్‌పూర్, సిందూలి, ధాదింగ్ ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగింది. మరో 24గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు నేపాల్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో అధికారులు సహాయక చర్యలు మరింత వేగంవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment