కర్ణాటకలో మెగా వార్‌ | next big battle for Narendra Modi and Rahul Gandhi will be fought in Karnataka  | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో మెగా వార్‌

Published Tue, Dec 19 2017 11:57 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

next big battle for Narendra Modi and Rahul Gandhi will be fought in Karnataka  - Sakshi

సాక్షి, బెం‍గళూర్‌: గుజరాత్‌లో హోరాహోరీ పోరు ముగిసిన క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ముఖాముఖి తలపడనున్నారు. దక్షిణాదిలో పెద్దరాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుండగా, సౌత్‌లో పాగా వేసేందుకు కర్ణాటకను చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

ఇరు పార్టీలకు కర్ణాటక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్‌ వార్‌ను మరిపిస్తాయని భావిస్తున్నారు.గుజరాత్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించకముందే గుజరాత్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారం ప్రారంభించడాన్ని బట్టి కర్ణాటక పోల్స్‌ను పార్టీలు ఎంత సీరియస్‌గా తీసుకున్నాయన్నది స్పష్టమవుతోంది. బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగిస్తుండగా, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధే ప్రచారాస్త్రంగా బరిలో దిగింది.

గుజరాత్‌లో బీజేపీకి దీటైన పోటీ ఇవ్వడంతో రాహుల్‌ విజయ యాత్రకు శ్రీకారం చుట్టామని, కర్ణాటకలో గెలుపొంది విజయాన్ని రాహుల్‌కు బహుమతిగా అందిస్తామని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నారు.కర్ణాటకలో మోదీ మ్యాజిక్‌ పనిచేయదని స్పష్టం చేశారు.ఇక్కడ స్థానిక అంశాలే ప్రధానమని, ఇతర పార్టీల కంటే తామే ఎన్నికల రంగంలో ముందున్నామని చెప్పారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 127గా ఉంది. అయితే సిద్ధరామయ్య సర్కార్‌ అవినీతిని ఎండగడుతూ బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

గుజరాత్‌ విజయంతో సమరోత్సాహంతో కదులుతోంది. క్షేత్రస్ధాయిలో బలహీనంగా ఉండటం బీజేపీని కలవరపెడుతోం‍ది. బీఎస్‌ యడ్యూరప్ప సీఎం అభ్యర్థిత్వాన్ని కూడా నేతలంతా ఆమోదించడం లేదు. సిద్ధరామయ్య సర్కార్‌పై అసంతృప్తి, మోదీ-షా కాంబినేషన్‌ తమకు కలిసివస్తుందని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అవుతుంది. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట మసకబారితే, కాంగ్రెస్‌ కూడా క్షేత్రస్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని జేడీఎస్‌ రాష్ట్ర చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement