జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్(63) ఆదివారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నాలుగోసారి పగ్గాలు అందుకున్న జేడీయూ నేత
22 మంది మంత్రులుగా ప్రమాణం
దేవెగౌడ, మమత, అఖిలేశ్, మాంఝీ తదితరుల హాజరు
నితీశ్‌కు మోదీ అభినందనలు
పట్నా: జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్(63) ఆదివారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎనిమిది నెలల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన ఆయన సీఎం పగ్గాలు అందుకోవడం ఇది నాలుగోసారి. రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ.. నితీశ్‌తో ప్రమాణం చేయించారు. ముగ్గురు మహిళలు సహా 22 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని నితీశ్‌కు అప్పగించేది లేదని భీష్మించి, చివరకు రాజీనామా చేసిన మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. జేడీయూ అధినేత శరద్ యాదవ్, జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), అఖిలేశ్ యాదవ్(ఉత్తరప్రదేశ్), తరుణ్ గొగోయ్(అస్సాం), ఐఎన్‌ఎల్డీ నేత అభయ్ చౌతాలా తదితరులు కూడా హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమం బీజేపీ వ్యతిరేక నేతలకు వేదికగా మారినట్లు కనిపించింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుని మనవడితో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె పెళ్లి కారణంగా ఆ నేతలిద్దరూ హాజరు కాలేకపోయారు. కాగా మంత్రులుగా ప్రమాణం చేసిన 22 మందిలో 20 మంది మాంఝీ సర్కారులో పనిచేసి రాజీనామా చేసిన వారు కావడం గమనార్హం. ఇద్దరిని మాంఝీ కేబినెట్ నుంచి తప్పించారు. నితీశ్ సీఎం అయినందుకు ప్రధాని మోదీ ట్వీటర్‌లో ఆయనకు అభినందనలు తెలిపారు. సుపరిపరిపాలన అందిస్తానని ప్రమాణం తర్వాత నితీశ్ తెలిపారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ తన శిష్యుడైన మాంఝీని ఆ పీఠంపై కూర్చోబెట్టడం తెలిసిందే. మాంఝీ నితీశ్‌ను ధిక్కరించడం, ఇటీవల నితీశ్‌ను జేడీయూ తమ ఎల్పీ నేతగా ఎన్నుకుని, మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించడం, అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు మాంఝీ రాజీనామా చేయడమూ విదితమే.