
చేతులు కలపనున్న మాజీ సీఎంలు?
రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు చేతులు కలిపే అవకాశం కనిపిస్తోంది. జేడీ-యూ అభ్యర్థులిద్దరికి మద్దతు తెలపాల్సిందిగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ను బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐలను కూడా తమ సభ్యులకు మద్దతిచ్చి, బీజేపీని ఓడించాల్సిందిగా కోరానని, ఇదే విషయమై లాలూప్రసాద్తో కూడా మాట్లాడానని నితీష్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
1994లో లాలు నుంచి విడిపోయిన తర్వాత రెండు దశాబ్దాలలో.. తాను లాలూ సాయం కోరానంటూ నితీష్ చెప్పడం ఇదే తొలిసారి. జీతన్ రామ్ మాంఝీ ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు తెలియజేయడంతో ఇప్పుడు తమ అభ్యర్థులకు మద్దతివ్వాలని నితీష్ అడిగారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ కూడా బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకుని తమ అభ్యర్థులకు మద్దతిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.