
తేజస్వీ విజ్ఞప్తికి మళ్లీ నో చెప్పిన నితీష్
సాక్షి, పట్నా : రెండు వారాల్లో రెండుసార్లు తిరస్కరణలు.. సావధానంగా విన్నప్పటికీ చివరకు మాత్రం కుదరదు అనే సమాధానం. కాస్త సానుభూతిగా చూస్తూనే తప్పదంటూ స్పష్టీకరణ.. ఇది రెండు వారాలుగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎదుర్కొన్న అనుభవం. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నితీష్‌కు పక్కనే ఉన్న ప్రభుత్వ భవనాన్ని(పలాటియల్ బంగళా) కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుతం తేజస్వీకి అధికారం దూరంకావడం బీజేపీ సహాయంతో నితీష్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడం వంటి కారణాలతో ఆ భవనాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ మోదీకి అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను ఆ భవనం నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటూ తేజస్వీకి ప్రభుత్వం నోటీసులు పంపించింది. అయితే, ఆ భవనాన్ని తాను ఎంతో ఇష్టపడ్డానని, ప్రేమతో అలంకరించుకొని పునరుద్ధరణ కూడా చేయించుకున్నానని చెప్పారు.
రెండుసార్లు ఆయన తనకు ఆ భవనాన్ని ఉంచాలని ప్రాధేయపడినప్పటికీ ఇచ్చేందుకు మాత్రం నితీష్ నిరాకరించారు. వీలయినంత త్వరలోనే దానిని ఖాళీ చేసి వెళ్లాలని చెప్పారు. 'ప్రభుత్వ భవనాలపై ఎవరూ వ్యక్తిగతంగా మోజును పెంచుకోవద్దు. ఈ రోజు నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాను. అది నాకు శాశ్వతం కాదు' అని ఆయన తేజస్వీని ఉద్దేశించి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.