
పెగ్గులమీద పెగ్గులేసి నితీశ్ పరువు తీశాడు
పాట్నా: ఆయనొక బిహార్ రూలింగ్ పార్టీ నాయకుడు. సొంతపార్టీ అధికారంలో ఉంది కదా.. ఆ మత్తుకు మద్యం మత్తు చేర్చాడు. ఓ పక్క రాష్ట్రమంతా మద్యాన్ని నిషేధించి ఎవరు ఆ మత్తు బారిన పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్యలు తీసుకుంటుండగా.. ఈ నాయకుడు మాత్రం అందుకు భిన్నంగా పనిమొదలుపెట్టాడు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన లలన్ రామ్ అనే ఈ పెద్ద మనిషి ఏం చక్కా బనియన్, షార్ట్ వేసుకొని ఓ రబ్బురు కుర్చీలో కూర్చుని ఎదురుగా బీరు బాటిళ్లు ఇతర ఓడ్కా పెట్టుకొని పెగ్గులమీద పెగ్గులు లాగించాడు.
అలా పెగ్గులేస్తూ తానొక బాహుబలినని, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పక్కన ఉన్నంత సేపు ఏం కాదని డంబాలు పలికాడు. అతడి దురదృష్టం కొద్ది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని పలకరించింది. దీంతో మద్యం నిషేధం ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేశారు. పైగా ముఖ్యమంత్రి పరువు తీయడమే కాకుండా.. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు.