జైసల్మీర్‌లో జవాన్లనుద్దేశించి ప్రసంగిస్తున్న రాజ్‌నాథ్ సింగ్
జైపూర్/న్యూఢిల్లీ: సరిహద్దులో పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నవేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదు’అన్న విధానానికే భారత్ కట్టుబడి ఉందనీ, అయితే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను రాజ్‌నాథ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది.
కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘భారత్ బాధ్యతాయుతమైన అణ్వస్త్రశక్తిగా మారడం ప్రజలందరికీ గర్వకారణమే. ఇందుకు భారత్ అటల్‌జీకి రుణపడి ఉంటుంది’అని ట్వీట్ చేశారు. మరోవైపు రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అణ్వాయుధాల ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను బయటపెట్టాలనీ, ఈ అస్పష్టతకు తెరదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వెనుక దేశమంతా నిలబడుతుందనీ, అయితే ముందుగా మన అణు విధానంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment