పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌! | Rajnath Singh Comments On India Nuclear Policy | Sakshi
Sakshi News home page

అణ్వాయుధాలపై విధానం మారవచ్చు: రాజ్‌నాథ్‌

Published Fri, Aug 16 2019 3:13 PM | Last Updated on Fri, Aug 16 2019 8:09 PM

Rajnath Singh Comments On India Nuclear Policy - Sakshi

జైపూర్‌ : ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే అంశంలో భారత్‌ భవిష్యత్తులో తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో ఆయనకు రాజ్‌నాథ్‌  నివాళులు అర్పించారు. వాజ్‌పేయి చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అణ్వాస్త్రాలను సంధించే విధానంలో ఇప్పటిదాకా భారత్‌ అనుసరించిన విధానంలో మార్పు రావొచ్చని పేర్కొన్నారు. ‘భారత్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించుకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోంది. నేటికీ ఆ విషయానికి కట్టుబడి ఉంది. అయితే భవిష్యుత్తులో ఎదురయ్యే పరిస్థితులపైనే ఈ విధానం ఆధారపడి ఉంటుంది ’అని పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

జాతి మొత్తం రుణపడి ఉంది
‘భారత్‌ అణ్వాయుధ దేశం. ఈ విషయం ప్రతీ భారతీయ పౌరుడు గర్వించదగినది. ఈ కారణంగా భరత జాతి మొత్తం అటల్‌జీకి రుణపడి ఉంది. పోఖ్రాన్‌లో చేపట్టిన పరీక్షల ద్వారా మన అణ్వాయుధ శక్తి అందరికీ తెలిసింది. అదే విధంగా మొదటగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదనే నియమాన్ని అనుసరిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులపైనే ఈ విధానం ఆధారపడి ఉంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. కాగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో...భారత్‌ అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 1998 మార్చి 11, 13 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌ ప్రాంతంలో ఐదు అణుపరీక్షలు నిర్వహించారు.

ఇక కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశ పాకిస్తాన్‌ భారత్‌ను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌ కోసం అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఈ విషయంలో చైనా, ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మధ్యవర్తిత్వం మేరకు కశ్మీర్‌ అంశంపై నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement