
క్రైమ్ షో చూసి.. కిడ్నాప్ డ్రామాకు స్కెచ్!
న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట అదృశ్యమైన నోయిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ షిప్రా మాలిక్ ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరింది. అయితే ఆమె హఠాత్తుగా అదృశ్యమై.. కిడ్నాప్ డ్రామా సృష్టించడానికి కారణాలు ఏమిటన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీవీ సీరియల్ 'క్రైమ్ పెట్రోల్' ప్రేరణతో షిప్రా ఈ బూటకపు కిడ్నాప్ తంతును సృష్టించిందని, ఆమెను ఎవరూ అపహరించలేదని పోలీసులు చెప్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రాథమిక విచాణ జరిపిన పోలీసులు.. అసలు షిప్రా మాలిక్ అపహరణ జరుగలేదని స్పష్టం చేశారు. ఇంట్లో సమస్యలు, కుటుంబసభ్యుల పట్ల అసంతృప్తితోనే ఫిబ్రవరి 29న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తన ఇష్టప్రకారమే ఇంటిని వీడిన ఆమె పలు ప్రదేశాల్లో తిరిగిందని, గత మూడురోజుల్లో హర్యానాలోని ఓ ఆశ్రమంలోనూ ఆమె గడిపిందని పోలీసులు తెలిపారు. తమ విచారణలో ఆమె వెల్లడించిన వివిధ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షిప్రా మాలిక్ మొదట తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గుర్గావ్‌కు తీసుకెళ్లారని, ఆ తర్వాత వదిలేశారని పేర్కొంది. ఆ తర్వాత మాట మార్చింది. ఈ నేపథ్యంలో ఆమె మానసికి పరిస్థితిని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఆమె బూటకపు అపహరణ డ్రామా ఆడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.