నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది.
నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్‌ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది.
అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్
Comments
Please login to add a commentAdd a comment