మాల్యా వ్యవహారంలో ఈడీకి షాక్
బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కు భారీ ఊరట లభించింది. ఉద్దేశ పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ ను ఎలాగైనా దేశానికి రప్పించాలని చూస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ తగిలింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసుల జారీ చేసే వ్యూహంలో ఈడీకి భారీ నిరాశ ఎదురైంది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనపై ప్రాథమికంగా విచారణ చేపట్టిన సంస్థ ఈడీ సమర్పించిన సాక్ష్యాలు సరిపోవని ఇంటర్ పోల్ తేల్చి చెప్పింది. అతనికి ఇప్పటికిపుడు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేమని చెప్పింది.
భారత ప్రభుత్వం మాల్యాపై నేరారోపణలను రుజువు చేయలేకపోయిందని ఇంటర్ పోల్ పేర్కొంది. మరోవైపు భారత ప్రభుత్వ అభ్యర్థన పై మాల్యా వివరణను ఇంటర్ పోల్ కోరనుంది. అనంతరం ఈ మొత్తం వ్యవహారాన్ని సమక్షించనుంది. దీనికి మరో మూడు నెలలుపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి పారిపోయిన విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నాలపై బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నీళ్లు చల్లింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే.